నోవాక్ జకోవిచ్ - నిశేష్ బసవారెడ్డి మధ్య తొలి రౌండ్ రసవత్తరంగా సాగింది. తెలుగు మూలాలున్న 19 ఏళ్ల కుర్రాడు నిశేష్ తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ ఈ రౌండ్ లో గట్టిగా పోరాడినప్పటికీ చివరికి ఓడిపోయాడు. దీంతో జకోవిచ్ తొలి రౌండ్ లో 4-6 6-3 6-4 6-2 విజయం సాధించి రెండో రౌండ్ కు అర్హత సాధించాడు.
తొలి సెట్ లో నిశేష్ దూకుడు ప్రదర్శించాడు. పెద్దగా అనుభవం లేనప్పటికీ, ఈ తెలుగు సంతతి కుర్రాడు మాజీ వరల్డ్ నెంబర్ వన్ జకోవిచ్ కు గట్టిపోటీనిచ్చేలా ఆడాడు. అతడి జోరుకు జకోవిచ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. నిశేష్ 4-6 తేడాతో పైచేయి సాధించాడు. కానీ ఆ తర్వాత సెట్లలో జకోవిచ్ పుంజుకోవడంతో నిశేష్ కు నిరాశ ఎదురైంది. 6-3 6-4 6-2 జకోవిచ్ గెలిచాడు. ఏదేమైనా స్టార్ ప్లేయర్ పై తొలి రౌండ్ లోనే విజయం సాధించిన నెల్లూరు కుర్రాడిపై తెలుగు క్రీడాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అతడు, ర్యాంకింగ్స్‌లో 133వ స్థానంలో ఉన్నప్పటికీ... ప్రపంచ మేటీ ఆటగాడినే వణికించడం గమనార్హం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే నిశేష్ పై జకోవిచ్ కూడా ప్రశంసలు కురిపించాడు. అద్భుతంగా పోరాడడంటూ కితాబిచ్చాడు. మ్యాచ్ చివరి వరకు నిశేష్ కనబర్చిన పోరాట పటిమ తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాడు. అతడి ప్రదర్శన తీరు తనను ఆశ్చర్యానికి గురి చేసిందని వెల్లడించాడు. కెరీర్ లో నిశేష్ అత్యుత్తమంగా రాణించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు. కాగా, రౌండో రౌండ్ లో జకోవిచ్ 21 ఏళ్ల పోర్చగీస్ జేమీ ఫారియాతో తలపడనున్నాడు. ఈ టోర్నీలో ఎలాగైనా గెలిచి 25వ టైటిల్ ను ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు.