ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ గత వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారించిన జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో స్కిల్ స్కాం జరిగిందని.. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ 2023లో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.
స్కిల్ కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో సుమారు 50 రోజులకు పైగా ఉన్నారు. అనంతరం బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా చంద్రబాబు తరుఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నారా చంద్రబాబు నాయుడుకి బెయిల్ మంజూరు చేసింది. అయితే చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ గత వైసీపీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ బుధవారం విచారణకు రాగా.. సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ కొట్టివేసింది. స్కిల్ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ ఫైల్ చేసిన విషయాన్ని ఏపీ ప్రభుత్వం తరుఫుు న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు తెలియజేశారు.
ఈ నేపథ్యంలో ఛార్జిషీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్‌లో ఇప్పుడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతూ జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ కొట్టివేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో దాఖలు చేసిన చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేసు విచారణకు అవసరమైన సమయంలో సహకరించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టు సూచించింది.
మరోవైపు చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఇంప్లీడ్ పిటిషన్ వేసిన జర్నలిస్టు మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకేం సంబంధమంటూ ప్రశ్నించింది. సంబంధం లేని వ్యవహరాల్లో పిటిషన్ ఎలా వేస్తారని మండిపడింది. ఇంకోసారి ఇలాంటివి పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ జస్టిస్ బేలా త్రివేది జర్నలిస్టును హెచ్చరించారు. అలాగే ఇంప్లీడ్ పిటిషన్ కొట్టివేశారు.