వైజీగ్ స్టీల్ ప్లాంట్ పునర్వైభవం కోసం రూ. 11,440 కోట్ల స్పెషల్ ప్యాకేజీని ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. మూతపడే స్థాయికి చేరుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఆదుకుంటామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారని చెప్పారు. ప్లాంట్ కు పునర్వైభవం తెచ్చేందుకు సహకరించిన మోదీకి మొత్తం క్రెడిట్ దక్కుతుందని అన్నారు. ఈ ప్లాంట్ వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చెప్పారు. ఉక్కు రెక్కల ఆయుధాలతో ఏపీ సరికొత్త శిఖరాలకు ఎదుగుతుందని, లక్షల మంది జీవితాలను మార్చుతుందని అన్నారు.