కర్ణాటకలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా చోరీలకు పాల్పడుతూ.. పెద్ద మొత్తంలో సొమ్ము కాజేస్తున్నారు. నిన్నటికి నిన్న ఎస్‌బీఐ ఏటీఎం వద్ద చోరీకి పాల్పడిన పలువురు దొంగలు.. కాల్పులు జరిపి మరీ 93 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. ఇదిలా ఉండగా నేడు మంగళూరులోని ఓ కోపరేటివ్ బ్యాంకులోకి చొరబడ్డ దొంగల ముఠా.. అక్కడున్న వారందరినీ బెదిరించి 15 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకెళ్లింది. అంతేకాకుండా 5 లక్షల రూపాయల నగదును కూడా కొట్టేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
జులాయి సినిమాలో.. పోలీసులు రాజకీయ నాయకుడి బందోబస్తుకు వెళ్లగా అదును చూసి దొంగలు ఓ బ్యాంకును దోచేశారు. అచ్చం అలాంటి సీనే రిపీట్ అయింది కర్ణాటకలో. ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి మంగళూరు పర్యటనలో ఉన్నారు. ఈక్రమంలోనే స్థానిక పోలీసులు అంతా బందోబస్తు కోసం అక్కడకు వెళ్లారు. ఆ విషయం గుర్తించిన ఓ ఐదుగురు దొంగల ముఠా.. అదే జిల్లాలోని ఉల్లాల కుడ్ల సమీపంలోని కోపరేటివ్ బ్యాంకులో దోపిడీకి ప్లాన్ చేసింది. ముఖ్యంగా బ్యాంకులో వినియోగదారులు తక్కువగా ఉన్న సమయం గుర్తించి మరీ దొంగతనానికి పాల్పడింది.
పట్టపగలు.. పలువురు వినియోగదారులు, ఉద్యోగులు మాత్రమే ఉండగా.. మారణాయుధాలతో బ్యాంకులోకి ప్రవేశించారా ఐదుగురు దొంగలు. ఆపై అందులోని వాళ్లందరినీ బెదిరించి.. 15 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరాణాలను కొట్టేశారు. అంతేకాకుండా 5 లక్షల రూపాయల నగదును కూడా దోచేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేయగా.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు అంతా బందోబస్తుకు వెళ్లడం, బ్యాంకులో దోపిడీ జరగడంతో.. ప్రజలంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసు వ్యవస్థ సాధారణ ప్రజల అవసరాలను తీర్చడం కంటే.. రాజకీయ నాయకులకు బందోబస్తు ఏర్పాటు చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటూ ఆరోపిస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. గురువారం రోజు మిట్ట మధ్యాహ్నం బీదర్‌లోని ఓ ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై ఇద్దరు దొంగలు కాల్పులకు పాల్పడ్డారు. ముందుగా ఉద్యోగులపై కారం చల్లి మొత్తం ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం 93 లక్షల రూపాయలు కల్గిన ఓ బాక్సును ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనలో ఓ సెక్యూరిటీ గార్డ్ ప్రాణాలు కోల్పోగా మరో ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ముఖ్యంగా ఈ దొంగతనానికి పాల్పడ్డ దొంగలు ఇద్దరూ హైదరాబాద్ వచ్చినట్లు తెలుసుకున్న కర్ణాటక పోలీసులు.. వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడి పోలీసులకు సమాచారం అందించగా.. చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈక్రమంలోనే నిందితులు ఇద్దరూ అఫ్జల్ గంజ్‌లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లారు. అప్పటికే నిందితుల్లో ఒకరైన అమిత్ కుమార్ మారు పేరుతో రాయ్‌పూర్‌కు వెళ్లేందుకు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. అది గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా కాల్పులు జరిపాడు. ఆపై తప్పించుకుని పారిపోయాడు. ఈక్రమంలోనే బస్సు క్లీనర్ తీవ్ర గాయాలపాలయ్యాడు.
ఇప్పటికీ దొంగలు ఇద్దరూ హైదరాబాద్‌లోనే ఉన్నారని.. వారి కోసం గాలిస్తున్నట్లు ఇటు తెలంగాణ పోలీసులుతో పాటు కర్ణాటక పోలీసులు వివరిస్తున్నారు. వారి వద్ద తుపాకీలు ఉండడంతో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.