మహిళలు, బాలికల్లో రక్తహీనత నివారణ, మాతా శిశు మరణాల కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి పదేళ్ల నుంచి పందొమ్మిదేళ్ల వయస్సులోపు బాలికలు, 49 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన మహిళలకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి రక్తహీనతను గుర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రక్తహీనత కలిగిన వారికి అవసరమైన ఐరన్ ట్లాబ్లెట్లు, ఇంజక్షన్లు, పౌష్టికాహారం అందించి రక్తహీనతను నివారించేందుకు వైద్య మహిళా శిశు సంక్షేమ అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణులను గుర్తించి వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలను నిర్వహించి మందులను పంపిణీ చేయాలని సూచించారు. సాధ్యమైనంతవరకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది తరచూ గర్భిణీల ఇళ్లను సందర్శించి రక్తహీనత సమస్య ఏర్పడకుండా పౌష్టికాహారం తీసుకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాతా, శిశు సంరక్షణకు ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొనేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపకుండా చూడాలన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని అమలు చేయడంలో వైద్య ఆరోగ్య మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని, డీసీహెచ్‌సీ డీసీకే నాయక్, ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ జిల్లా కో-ఆర్డినేటర్ జె.సుమన్, మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీవోలు జి.మంగమ్మ, కె.నాగమణి, లక్ష్మీభార్గవి, భాగ్యరేణుక, సత్యవతి, పుష్పవతి, నోడల్ ఆఫీసర్ సాయిగీత, ప్రోగ్రాం ఆఫీసర్ రాజేశ్వరరావు పాల్గొన్నారు.