ఏపీ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తోందని... రాష్ట్రం అన్ని విధాలా పురోగమిస్తోందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 11,440 కోట్ల ప్యాకేజీని ప్రధాని మోదీ ఇచ్చారని జీవీఎల్ అన్నారు. విశాఖ రైల్వే జోన్ కార్యరూపం దాల్చిందని చెప్పారు. అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్ల బడ్జెట్ ను కేంద్రం ఇచ్చిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు అక్టోబర్ నెలలో అడ్వాన్స్ గా రూ. 2,800 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కు ఇటీవల మోదీ శంకుస్థాపన చేశారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని తాను పార్లమెంట్ లో లేవనెత్తానని గుర్తు చేశారు.కూటమి ప్రభుత్వంతో ఏపీకి మంచి రోజులు వచ్చాయని జీవీఎల్ అన్నారు. గత ఏడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించిందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. సంక్రాంతి వేడుకలు ఘనంగా జరగడం సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ఇక, సైబర్ నేరాల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ నేరస్తులు ఇంటర్నేషనల్ మాఫియాలా తయారయ్యారని చెప్పారు.