అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభం నుంచి అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్ అగైన్ నినాదాలను వినిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్.. అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే వాటిపై పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికన్లకు మేలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోకి వచ్చే అక్రమ వలసలను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధించి.. మరిన్ని బలగాలను మోహరిస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో తాజాగా అమెరికాలో పుట్టే పిల్లలకు పుట్టుకతో వచ్చే అమెరికా పౌరసత్వం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు.. అమెరికాకు అక్రమ వలసలను అడ్డుకుంటామని మొదటి నుంచి చెబుతున్న డొనాల్డ్ ట్రంప్.. ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులను బయటికి పంపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే డొనాల్డ్ ట్రంప్.. అక్రమ వలసదారులపై బహిష్కరణ విధించడం.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై పని మొదలుపెట్టారు. అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న ఇతర దేశాల పౌరులను అందర్నీ గుర్తించి.. వారిని తిరిగి వారి వారి దేశాలకు పంపించేందుకు ట్రంప్ కార్యవర్గం చర్యలు చేపట్టింది. ఈ విషయంలో భారత ప్రభుత్వం కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని భారత ప్రభుత్వం భావిస్తోందని.. ఫలితంగా వాణిజ్య యుద్ధాన్ని నివారించేందుకు, ట్రంప్‌కు సహకరించేందుకు ఇది ముందస్తు ఆలోచన అని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. అమెరికాలో 18 వేల మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు రెండు దేశాలు గుర్తించాయి. త్వరలోనే ఈ 18 వేల మందిని తిరిగి భారత్‌కు పంపించే అవకాశాలు ఉన్నాయి. అయితే 18 వేల మంది అని చెబుతున్నప్పటికీ.. ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కానీ అమెరికాలో ఎంతమంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నారనే లెక్కలు స్పష్టంగా తెలియరాలేదు. ఇలా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని.. వెనక్కి తీసుకురావడం వల్ల.. ఆ దేశంలోకి సక్రమంగా వెళ్లే భారతీయులకు లాభం చేకూరుతుందని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే హెచ్ 1బీ వీసా కార్యక్రమాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం.. మరింత వేగవంతం చేస్తుందని భారత్ ఆకాంక్షిస్తోంది. అమెరికా అధికారిక లెక్కల ప్రకారం.. 2023 ఏడాదిలో 3.86 లక్షల మంది హెచ్ 1బీ వీసాలు పొందగా.. అందులో దాదాపు మూడింట రెండు వంతుల మంది భారతీయ పౌరులే ఉండటం గమనార్హం. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ డేటా 2024 గణాంకాల ప్రకారం.. అమెరికాకు వెళ్తున్న అక్రమ వలసదారుల్లో 3 శాతం మంది భారతీయులు ఉన్నారు. ఇక మెక్సికో, వెనుజులా, గ్వాటెమాల వంటి లాటిన్ దేశాల నుంచి అమెరికాకు భారీగా అక్రమంగా ప్రవేశిస్తున్నారు.
మరీ ముఖ్యంగా అమెరికా ఉత్తర సరిహద్దుల్లో నుంచి భారతీయులు అక్రమంగా ఆ దేశంలోకి చొరబడుతున్నారు. గతేడాది అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇచ్చిన నివేదిక ప్రకారం.. 2022 నాటికి అమెరికాలో దాదాపుగా 2.20 లక్షల మంది అమెరికాలో అక్రమంగా భారతీయులు నివసిస్తున్న వలసదారులు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. అక్టోబర్ నెలలో అమెరికా నుంచి భారత్‌కు 100 మందికి పైగా అక్రమ వలసదారులను చార్టెడ్ విమానంలో పంపించారు. గత ఏడాది కాలంగా 1100 మందికి పైగా భారతీయులు అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యారు.