మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికుల మీద నుంచి మరో రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాదాపు 40మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని పలు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని, క్షతగాత్రుల చికిత్స ఖర్చులు భరిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ సాయంత్రం 5గంటల సమయంలో పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు వ్యాపించినట్టు వదంతులు వ్యాపించగా.. భయంతో ప్రయాణికులు ఆ రైలు చైన్‌లాగి పట్టాలపై దిగారు. ఈ క్రమంలో పట్టాలు దాటుతుండగా పచోరా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చి వారిని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై తమకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఒక కోచ్‌లో హాట్ యాక్సిల్ లేదా బ్రేక్ బైండింగ్ కారణంగా నిప్పురవ్వలు చెలరేగాయని అధికారి ఒకరు చెప్పారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై చైన్ లాగారని తెలిపారు. కొందరు ట్రాక్‌లపై దూకేసిన సమయంలో కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రావడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఘటనలో ఇప్పటివరకు 10 నుంచి 12 మంది వరకు మృతిచెంది ఉంటారని మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ తెలిపారు.