ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంట్రీబ్యూటరీ ఫించన్ పధకంపై ప్రభుత్వానికి నివేదిక అంద‌జేత‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 28, 2019, 07:50 PM

రాష్ట్రంలో కంట్రిబ్యూటరీ ఫించన్ పధకం స్థానే పాత ఫించన్ విధానాన్ని కొనసాగించాలన్న ప్రభుత్వ కంట్రీబ్యూటరీ ఫించన్ ఉద్యోగుల డిమాండ్‌పై పూర్వ‌పు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి టక్కర్ అధ్యక్షతన ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠకు అందించింది. ఈ మేరకు గురువారం అమరావతి సచివాలయంలో ఈ నిపుణుల కమిటీ తన నివేదికను సిఎస్‌కు అందించింది. రాష్ట్రంలో 2004 సెప్టెంబరు 1వ తేదీ తర్వాత వివిధ ప్రభుత్వ శాఖల్లో చేరిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ నూతన ఫించన్ విధానం ప్రకారం కంట్రిబ్యూటరీ ఫించన్ పధకాన్ని అమలు చేయడం జరుగుతోంది. అయితే ఈ నూతన కంట్రీబ్యూషన్ పధకాన్ని రద్దు చేసి పాత ఫించన్ పధకాన్ని అమలు చేయాలని వివిధ కంట్రీబ్యూటరీ ఫించన్ పధకం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు పెద్దఎత్తున డిమాండు చేస్తున్న నేపధ్యంలో కంట్రిబ్యూటరీ ఫించన్ పధకంపై ప్రభుత్వం టక్కర్ అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2018 నవంబరు 28న జిఒఆర్టి నంబరు 2052 ద్వారా టక్కర్ అధ్యక్షునిగా రాష్ట్ర ఆర్ధికశాఖ కార్యదర్శి పియూష్ కుమార్ సభ్య కార్యదర్శిగాను న్యాయశాఖ కార్యదర్శి డి.వెంకటరమణ తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఆర్ధికశాస్త్ర విశ్రాంత పొపెసర్ కె.మునిరత్నం నాయుడు హైదరాబాదు సెస్ ఆర్దికశాస్త్ర డైరెక్టర్ ప్రొపెసర్ గలాబ్‌లు సభ్యులుగా నిపుణుల కమిటినీ నియమించి మూడు మాసాల్లోగా నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశించింది. ఈ కమిటీ కంట్రీబ్యూటరీ ఫించన్ పధకంపై విస్తృతంగా సమీక్షించి వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఈ పధకంపై అధ్యయనం చేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్నకంట్రీబ్యూటరీ ఫించన్ పధకం రద్దు చేస్తే దానివల్ల కలిగే ఆర్ధిక, న్యాయపరమైన ఇబ్బందులు, రాష్ట్రంపై పడే అదనపు ఆర్ధిక భారం వంటి అంశాలను పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో నిపుణుల కమిటీని ఆదేశించింది. కంట్రిబ్యూటరీ ఫించన్ పధకాన్ని రద్దు చేసి పాత ఫించన్ విధానాన్ని కొనసాగిస్తే వివిధ ఉద్యోగులు ఇప్పటి వరకూ కంట్రీబ్యూటరీ ఫించన్ పధకం కింద చెల్లించిన మొత్తానికి ప్రభుత్వం ఎంత మొత్తాన్ని చెల్లించాలనే దానిపై కూడా సవివరమైన నివేదికను సమర్పించాల్సిందిగా ప్రభుత్వం కోరగా దానిపై కూడా నిపుణుల కమిటీ సమీక్షించి నివేదికలో పొందుపర్చి అందించింది. అదేవిధంగా ఒకవేళ కంట్రిబ్యూటరీ ఫించన్ పధకాన్ని రద్దు చేసి పాత ఫించన్ విధానాన్నికొనసాగిస్తే ఇప్పటికే కంట్రిబ్యూటరీ ఫించన్ పధకం పరిధిలో ఉండి పదవీ విరమణ చేసిన లేదా సర్వీసులో ఉండి చనిపోయిన వారికి సంబంధించి ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు కలుగుతాయనే అంశంపై కూడా ఈ నిపుణుల కమిటీ పరిశీలించి తగు సిఫార్సులను కమిటీ నివేదికలో పొందిపర్చి సమర్పించింది. మొత్తం మీద కంట్రిబ్యూటరీ ఫించన్ పధకంపై పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మూడు మాసాల్లోనే సకాలంలో నిపుణుల కమిటీ తన నివేదికను సమర్పించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa