గతేడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ యువతి చేపట్టిన ఆందోళనల వెనుక పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) హస్తం ఉందనడానికి తాజా పరిణామాలే నిదర్శనం. ఇటీవల ఐఎస్ఐకు చెందిన నలుగురు ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం రహస్యంగా బంగ్లాదేశ్‌లో పర్యటించింది. భారత భద్రతపై ప్రభావం చూసే ఈ అంశంపై న్యూఢిల్లీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై విదేశాంగ శాఖ శుక్రవారం స్పందిస్తూ... పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
పాకిస్థాన్ ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ (ఎనాలిసిస్) మేజర్ జనరల్ షాహిద్ అమిర్ అఫ్సర్ సహి ఇతర సీనియర్ అధికారులు బంగ్లాదేశ్‌లో పర్యటించినట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. బంగ్లాదేశ్ సైనిక ప్రతినిధి బృందం రావల్పిండిలో పాక్ త్రివిధ దళాధిపతులను కలిసిన వెంటనే ఈ పర్యటన జరిగింది. ఐఎస్ఐ ప్రతినిధుల బంగ్లాదేశ్ పర్యటనపై మీడియా అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ సమాధానం ఇచ్చారు. ‘దేశం, ప్రాంతం చుట్టూ జరుగుతున్న అన్ని కార్యకలాపాలు, జాతీయ భద్రతను ప్రభావితం చేసే అన్ని చర్యలను నిశితంగా గమనిస్తున్నాం.. ప్రభుత్వం అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటుంది’ అని ఆయన వెల్లడించారు.
బంగ్లాదేశ్ సైనిక సైనిక ప్రతినిధి బృందం పాక్‌లో పర్యటించి.. ఆ దేశ త్రివిధ దళాధిపతులతో రావల్పిండిలో భేటీ అయ్యింది. ఇది జరిగిన వారంలోనే ఐఎస్ఐ ఉన్నతాధికారుల బృందం బంగ్లా పర్యటనకు వచ్చింది. ఈ నలుగురిలో బీజింగ్‌లో పాక్ రక్షణ అనుబంధ అధికారి ఐఎస్ఐ ఎనాలిసిస్ విభాగం డీజీ మేజర్ జనరల్ షాహిద్ అమిర్ అఫ్సర్ ఒకరు. జనవరి 13 నుంచి 18 మధ్య బంగ్లాదేశ్ సైనిక అధికారులు పాక్‌లో పర్యటించగా.. మూడు రోజుల అనంతరం అంటే జనవరి 21న ఐఎస్ఐ ప్రతినిధులను దాయాది రహస్యంగా ఢాకాకు పంపింది. దాదాపు రెండు దశాబ్దాల అనంతరం ఐఎస్ఐ సీనియర్ అధికారులు బంగ్లాదేశ్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి.
బంగ్లాదేశ్ సైనిక స్థావరాల్లో పర్యటించిన ISI బృందానికి తమ సైనిక సామర్థ్యాలు, సంసిద్ధత గురించి వారికి తెలియజేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పాకిస్థాన్ ఆర్మీ మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘బంగ్లాదేశ్ లెఫ్టినెంట్ జనరల్ SM కమ్రుల్ హసన్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ మధ్య జరిగిన సమావేశం బలమైన రక్షణ సంబంధం ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.. రెండు సోదర దేశాల మధ్య శాశ్వత భాగస్వామ్యం బాహ్య ప్రభావాలకు వ్యతిరేకంగా స్థిరంగా ఉండాలని స్పష్టం చేసింది’’ అని పేర్కొంది.
షేక్ హసీనా ప్రధానిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్‌లో ఐఎస్ఐ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. బంగ్లా రాజకీయాల్లో జోక్యం, కోవర్టులు, తీవ్రవాదాన్ని రెచ్చగొట్టే చర్యలకు ఆమె చెక్ పెట్టారు. షేక్ హసీనా నాయకత్వంలో 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో ISIతో అంటకాగిన వారిని పట్టుకుని విచారించారు. కానీ, గతేడాది ఆగస్టులో హసీనా పదవి నుంచి దిగిపోయి.. మహ్మద్ యూనస్ నాయకత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాక్, బంగ్లాదేశ్ మధ్య సైనిక సంబంధాలు బలపడుతున్నాయి.
ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకోవడంతో 1990లలో పాక్‌లో ఉగ్రవాద శిబిరాలు పుట్టుకొచ్చాయి. ఈశాన్య రాష్ట్రాలలో ఉగ్రవాదం, తిరుగుబాట్లకు నిధులు సమకూర్చడానికి బంగ్లాదేశ్‌ను కూడా ఐఎస్ఐ ఉపయోగించుకుంది. కానీ, 1996లో షేక్ హసీనా మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని అణిచివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa