ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరిలో మోదీ అమెరికా పర్యటన.. వైట్‌హౌస్‌లో కలుస్తానన్న డొనాల్డ్ ట్రంప్!

national |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 08:00 PM

 అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇటీవలె బాధ్యతలు చేపట్టారు. అయితే బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే సంచలన నిర్ణయాలు, ఉత్తర్వులపై సంతకాలు చేస్తున్న ట్రంప్.. ప్రపంచ దేశాల చూపును తనవైపు తిప్పుకుంటున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, వివిధ దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్నుల పెంపు, పలు దేశాలను అమెరికాలో కలుపుకుంటామని హెచ్చరికలు, అమెరికాలోని అక్రమ వలసదారుల అరెస్ట్, వలసదారులకు అమెరికా పౌరసత్వం కల్పించే అంశాలపై సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా టాప్ హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. మొట్టమొదటిసారి డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నిన్న(సోమవారం) ఫోన్ కాల్ సంభాషణ జరిపారు.


ఈ క్రమంలోనే తాజాగా డొనాల్డ్ ట్రంప్ కీలక విషయం బయటపెట్టారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీంతో త్వరలోనే ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో తాను మోదీతో సమావేశమయ్యే అవకాశం ఉందని తాజాగా ట్రంప్ వెల్లడించారు. సోమవారం నరేంద్ర మోదీతో చాలా సేపు మాట్లాడినట్లు తెలిపారు. భారత్‌తో అమెరికాకు మంచి అనుబంధం ఉందని.. వచ్చే నెలలో భారత ప్రధాని వైట్‌హౌస్‌కు రావొచ్చు అని చెప్పారు.


ఈ సందర్భంగానే అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారుల అంశంపైనా ప్రధాని మోదీతో తాను చర్చించినట్లు ట్రంప్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. అక్రమ వలసదారులుగా వచ్చిన భారతీయులను చట్టబద్ధంగా స్వదేశానికి రప్పించే విషయంలో భారత్‌ సరైన నిర్ణయం తీసుకుంటుందని తాను నమ్ముతున్నట్లు ట్రంప్ తెలిపారు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన డొనాల్డ్ ట్రంప్.. తన చివరి పర్యటనగా భారత్‌కు రావడం గమనార్హం. 2020లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించిన డొనాల్డ్ ట్రంప్.. ప్రధాని మోదీతో కలిసి భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతకుముందు 2019 సెప్టెంబరులో హ్యూస్టన్‌లో నిర్వహించిన ర్యాలీలో మోదీ-ట్రంప్ ప్రసంగాలు చేశారు.


ఈనెల 20వ తేదీన అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వారం రోజులకు.. ట్రంప్‌తో మోదీ సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. భారత్-అమెరికా దేశాల మధ్య ఇప్పటివరకు ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. రెండు దేశాలకు పరస్పరం ప్రయోజనం చేకూర్చే అంశాలకు, విశ్వసనీయ భాగస్వామ్యానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని ప్రధాని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com