ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత జాలర్లపై శ్రీలంక నేవీ కాల్పులు.. ఐదుగురు గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమం

national |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 08:02 PM

శ్రీలంక తీరంలోని డెల్భ్ దీవికి సమీపంలోకి భారత దేశానికి చెందిన ఓ ఓడ వెళ్లింది. అందులో తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన 13 మంది మత్స్యకారులు ఉండగా.. వారందరినీ శ్రీలంక నౌకాదళం అడ్డుకుంది. ఆ సమయంలో జాలర్లు తప్పించుకోవడానికి యత్నించగా.. నేవీ అధికారులు కాల్పులకు పాల్పడ్డారు. ఈక్రమంలోనే ఐదుగురుకి గాయాలు అయ్యాయి. అయితే అందులో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, మరో ముగ్గురికి మాత్రం స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి.


అయితే ఆ ఐదుగురిని శ్రీలంక నేవీ అధికారులు జాఫ్నా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈక్రమంలోనే ముగ్గురికి ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మరో ఇద్దరిని మాత్రం అక్కడే అడ్మిట్ చేసుకున్నారు. ఆ తర్వాత నేవీ అధికారులు స్వల్ప గాయాలతో బయటపడ్డ ముగ్గురు సహా మరో 8 మందిని అక్కడి పోలీసులకు అప్పజెప్పారు. ప్రస్తుతం వారంతా శ్రీలంక పోలీసుల కస్టడీలో ఉన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అక్కడి భారత రాయబారి వెంటనే జాఫ్నా ఆసుపత్రికి వెళ్లి జాలర్లతో మాట్లాడారు.


అలాగే భారత్ కూడా ఇండియన్ జాలర్లపై కాల్పులు చేసిన శ్రీలంకపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆదేశ రాయబారికి సమన్లు జారీ చేసింది. అటు కొలంబోలోని భారత హైకమిషన్ కూడా శ్రీలంక దేశ విదేశాంగ శాఖతో ఈ విషయం గురించి మాట్లాడినట్లు సమాచారం. అయితే కాల్పుల గురించి ఆ దేశాధినేతలను ప్రశ్నించగా.. నావికాదళ సిబ్బంది నుంచి తుపాకీలు లాక్కొని, దాడికి యత్నించగా... కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరించారు. అలాగే అగమని చెప్పిన వెంటనే ఆగకుండా.. దూకుడుగా వ్యవహరించారని అందుకే తామలా చేయాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.


కానీ భారత్ మాత్రం మత్స్యకారుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని వారి సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని శ్రీలంకకు వెల్లడించింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ బల ప్రయోగం చేయడం ఆమోద యోగ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఒప్పందాలను తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com