2018-24 మధ్య విద్యా ప్రమాణాలపై ఏఎస్ఈఆర్ (యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్) నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 2022-24 మధ్య కాలంలో ఏపీలో విద్యా ప్రమాణాలు దిగజారినట్టు ఏఎస్ఈఆర్ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు గణితంలో వెనుకబడి ఉన్నారని నివేదిక తెలిపింది. వారికి లెక్కలు చేయడం కూడా రావడంలేదని పేర్కొంది.ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే 6 నుంచి 14 ఏళ్ల పిల్లలు 2018లో 63.2 శాతం ఉంటే 2024 నాటికి అది 61.8 శాతానికి తగ్గిందని వివరించింది. 15 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లల పాఠశాల నమోదు శాతం కూడా 2018లో 9 శాతం ఉంటే 2024లో మరీ దారుణంగా 1.3 శాతానికి పడిపోయిందని ఏఎస్ఈఆర్ వెల్లడించింది. 3వ తరగతి చదివే పిల్లల్లో 2వ తరగతి పాఠ్యపుస్తకాలు చదివే సామర్థ్యం ఉన్న వారు 2018లో 22.4 శాతం ఉంటే... 2022లో 10.4 శాతానికి పడిపోయినట్టు వివరించింది.