మహిళలు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందుల నుండి న్యాయం చేయడం కోసం కష్టాల్లో ఉన్న మహిళలకు సేవ చేయడానికే జాతీయ మహిళా పార్టీ స్థాపించడం జరిగిందని జాతీయ మహిళా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు టి.రాజేశ్వరి ప్రభాకర్ పేర్కొన్నారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని మీడియా హౌస్‌లో జాతీయ మహిళా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విలేకర్ల సమావేశంలో రాజేశ్వరి మాట్లాడుతూ జాతీయ మహిళా పార్టీ మహిళల చేత, మహిళల కొరకు ప్రారంభించబడిందని తెలిపారు. సమాజంలో స్త్రీలు రెండో తరగతి పౌరులుగా పరిగణింపబడుతున్నారని వారి జీవితాలలో వెలుగు నింపడానికి బ్రిటిష్ కాలం నుండి నేటి వరకు ఎన్ని చట్టాలు వచ్చినా ఎటువంటి మార్పు రాలేదని విమర్శించారు. సమాజంలో స్త్రీలు ఇంటా బయట అనేక సమస్యలు ఎదుర్కొంటూ, నేటికి భయం..భయంగా బయటకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న హింసలు, అత్యాచారాలు రోజురోజుకి పెరుగుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదని, వారికి ఎక్కడా న్యాయం జరగటంలేదని తెలిపారు. నిర్భయ లాంటి చట్టాలు, మహిళా కమిషన్‌లు ఎన్ని ఉన్నా మహిళలపై హింస జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటికీ సరియైన దారి రాజ్యాధికారం మాత్రమేనన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ, 25 పార్లమెంట్ స్థానాల్లోనూ జాతీయ మహిళా పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. పోటీ చేయదలచిన మహిళలు తమను సంప్రదించాలని కోరారు. త్వరలోనే ఏపీలో తమ పార్టీ తరఫున నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. సామాజిక బాధ్యతగా 1996 నుంచి కృషి వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా అనేక మంది మహిళలకు సహాయ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. జాతీయ మహిళా పార్టీ వనజ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతామని తెలిపారు. ఆడవాళ్లకు అన్యాయం జరగకుండా చూడటమే తమ ధ్యేయమని తెలిపారు. విలేకరుల సమావేశంలో జాతీయ మహిళా పాార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు శోభారాణి, కోశాధికారి రమ్య పుష్ప, సలహాదారు క్యాథరిన్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa