ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైన మందిరాల ప్రతిష్టా మహోత్సవాలు ఆరంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2019, 03:29 PM

విజయవాడలోని పాతబస్తీలో రెండు జైన మందిరాల ప్రతిష్టా మహోత్సవాలు శుక్రవారం ఉద‌యం వైభవంగా ఆరంభమైయ్యాయి. మార్వాడి గుడి వీధిలోని శ్రీ సంభవనాధ్ భగ‌వాన్ మందిరం పునప్రతిష్ట, కొత్తపేట హిందూ హైస్కూల్ సమీపంలో కొత్తగా నిర్మించిన శ్రీ సంభవనాధ్ మందిర్‌ల తెల్లని పాలరాతి విగ్రహాలు శుక్రవారం ఉదయం సంభవనగర్ (పున్నమిఘాట్)కు చేరుకున్నాయి. అక్కడ నుండి ఆ  విగ్రహాలను భారీ శోభాయాత్రలో ఆయా మందిరాలకు తరలించారు. అలంకరించిన సుమారు 15 పూల ర‌ధాల్లో ఆయా విగ్రహాల దాతలు భక్తి శ్రద్ధలతో వాటిని చేత‌బూని ముందుకు సాగగా భక్తులు మంగళవాయిద్యాలు, భక్తిగీతాలాపనలు, భజనలతో నృత్యాలు చేస్తూ శోభాయాత్రను అనుసరించారు. అప్పటికే సంభవ‌నగర్ చేరుకున్న జైన ఆచార్యులు శ్రీమద్ విజయ్ అజిత్ శేఖర్ సూరిశ్వ‌ర్‌జి, శ్రీమద్ విజయ్ విమల్ బోధి సూరీశ్వర్‌జీలు కూడా ఈ శోభాయాత్రలో పాల్గొని భక్తులకు మార్గదర్శకం చేశారు. శోభాయాత్రలో తరలించిన విగ్రహాలను జయ జయ ధ్వానాల‌తో రెండు మందిరాల్లోకి చేర్చడంతో ప్రతిష్ట మహోత్సవంలో ప్రధమ ఘట్టం ముగిసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అంతకు ముందు, గొల్లపూడి నుండి సంభవ‌న‌గ‌ర్‌కు చేరుకున్న జైన ఆచార్యులకు జైనులు ఘనస్వాగతం పలికి వారి ఆశీస్సులను స్వీకరించారు. ప్రతిష్ట మహోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమాల నిమిత్తం సంభవనగర్‌లో ఏర్పాటు చేసిన ప్రేమ్ భువన్‌నగర్, భారత్ చక్రవర్తి భోజన మండపాన్ని ఈ సందర్బంగా జైన ఆచార్యులు ప్రారంభించారు. ప్రతిష్టా మహోత్సవాల ప్రారంభానికి సూచికగా శుక్రవారం మధ్యాహ్నం నుండి రాత్రి వరకు వివిధ ఆధ్యాత్మిక భజనలు, భక్తి గీతాలాపనలు నిరంతరం కొనసాగాయి. నగరంలో జైన మందిరాల ప్రతిష్ట మహోత్సవాలను పురస్కరించుకుని దేశంలోని వివిధ ప్రాంతాల నుండి జైనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విజయవాడ నగర ప్రజలు సుఖశాంతులతో జీవించాలన్న ఆశయంతో జైన ఆలయాల నిర్మాణాన్ని చేపట్టినట్లు జైన ఆచార్య శ్రీమద్ విజయ్ అజిత్ శేఖర్ సూరిశ్వ‌ర్‌జి ఈ సందర్బంగా పేర్కొంటూ అహింస, శాంతితో సకల జీవులు జీవించాలన్నదే జైన మ‌త ధర్మం ప్రధమ ఆశయంగా అభివర్ణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa