ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభినందన్‌కు ఘనస్వాగతం

national |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2019, 11:31 PM

పాకిస్తాన్ యుద్ధవిమానాన్ని తరిమికొడుతూ ఆ దేశంలోకి వెళ్లి అక్కడి ఆర్మీకి పట్టుబడిన భారత వాయుసేన పైలట్ అభినందన్ వర్ధమాన్ క్షేమంగా తిరిగి వచ్చేశాడు. పంజాబ్ సరిహద్దులోని అత్తారి వాఘాలో పాక్ సైనికులు ఆయనను భారత అధికారులకు అప్పగించారు. లాహోర్ నుంచి రోడ్డు మార్గంలో అభినందన్‌ను తీసుకొచ్చిన  వాఘా సరిహద్దులో పాక్ అధికారులు మొదట రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు అప్పగించారు. తర్వాత వారు భారత అధికారులకు అప్పగించారు. అభినందన్‌కు రెడ్ క్రాస్ సిబ్బంది కొన్ని ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. పాక్.. అతనికి హాని తలపెట్టకుండా  పూర్తి ఆరోగ్యంతోనే పంపినట్లు నిర్ధారించుకోడానికి ఈ పరీక్షలు చేశారు. తర్వాత భారత్ అధికారులు కూడా పరీక్షలు నిర్వహించారు.
అభినందన్  రాక కోసం వేయికళ్లతో ఎదురుచూసిన భారతీయులు ఒక్కసారిగా ‘అభినందన్ కీ జై.. భారత్ మాతాకీ జై.. ’ అని ఉద్విగ్న హృదయాలతో నినాదాలు చేశారు. పూలు చల్లుకుంటూ, ఈలలు వేస్తూ ఉప్పొంగిపోయారు. వాఘా సరిహద్దుకు చేరుకున్న అభినందన్ కుటుంబ సభ్యులు సంతోషంతో ఉబ్బుతబ్బిబ్బయ్యారు. అతణ్ని భారత అధికారులు వైద్యపరీక్షల కోసం విమానంలో ఢిల్లీకి తీసుకొస్తున్నారు.
అభినందన్ రాకను పురస్కరించుకుని వాఘాలో రోజూ జరిగే ఇరు దేశాల సైనికుల బీటింగ్ రిట్రేట్ వేడుకను రద్దు చేశారు. కాగా,  అభినందన్‌కు స్వాగతం పలికే అవకాశాన్ని తనకు కల్పించాలన్న పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ వినతి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తోసిపుచ్చింది. భద్రతా కారణాలతో పాటు ప్రోటొకాల్‌ వల్ల అది సాధ్యం కాదని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa