శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ కె.వి.రమణ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ రథసప్తమి సందర్భంగా ఈ నెల 2, 3, 4 తేదీల్లో జరిగే వేడుకలకు 2,300 మంది పోలీసులతో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మూడు రోజులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతా యని చెప్పారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తు లు ఈ విషయాన్ని గమనించి పోలీసులతో సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ నిర్దే శించిన ప్రదేశాల్లో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని చెప్పారు.
భక్తులకు స్వామివారి దర్శనానికి రూ.300, రూ.500, డోనర్ పాసులు (క్షీరాభిషేకం) ఉన్నవారు తమకు కేటాయించిన సమయంలోనే దర్శనం చేసుకోవాలని సూచించారు. అనంతరం రథసప్తమి వేడుకలకు సంబంధించి ప్రవేశ, బయటకు వచ్చే మార్గాలు, వాహనాల పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు, క్యూలైన్లు తదితర అంశాలు తెలియజేసే పోస్టర్లను అదనపు ఎస్పీ కె.వి.రమణ, డీఎస్పీ వివేకానంద, ఎస్బీ సీఐ ఇమాన్యుయల్ రాజు, టౌన్ సీఐ పి.పైడపునాయుడు, ట్రాఫిక్ సీఐ నాగరాజుతో కలిసి ఆవిష్కరించారు.