లోక్‌సభలో కేంద్రం బడ్జెట్‌ని ప్రవేశపెడుతున్న సమయంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పాయి. ఫిబ్రవరి 1, 2025న, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలైన HPCL, BPCL, IOC కంపెనీలు..19 కేజీల వాణిజ్య LPG సిలిండర్ ధరను రూ.7 తగ్గించాయి. ఈ కొత్త రేట్లు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి.కమర్షియల్ సిలిండర్ ధరను తగ్గించినప్పటికీ.. ఇళ్లలో వాడుకునే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ధరలు ఆగస్టు 1, 2024 నుంచి స్థిరంగా ఉంటాయి. ఐతే.. కమర్షియల్ సిలిండర్ ధరలు.. ఆగస్టు నుంచి 5 నెలలు పెరిగి.. ఆ తర్వాత జనవరి నుంచి తగ్గుతున్నాయి. జనవరిలో రూ.14 తగ్గగా.. ఇప్పుడు రూ.7 తగ్గినట్లైంది. ఐతే.. అంతకుముందు.. వరుసగా ఐదు నెలల్లో ధర రూ.172 పెరిగింది. అంటే.. పెరుగుదల కంటే.. తగ్గుదల చాలా తక్కువగా ఉంటోంది.
గ్యాస్ సిలిండర్ కొత్త ధరలు:
ఢిల్లీ: ₹1,797 (గతంలో ₹1,804)
ముంబై: ₹1,749.50 (గతంలో ₹1,756)
కోల్‌కతా: ₹1,907 (గతంలో ₹1,911)
చెన్నై: ₹1,959.50 (గతంలో ₹1,966)
14.2 కేజీల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ప్రస్తుత ధరలు: ప్రస్తుతం ఇళ్లలో వాడుకునే సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో గమనిస్తే..
ఢిల్లీ: ₹803
ముంబై: ₹802.50
కోల్‌కతా: ₹829
చెన్నై: ₹818.50
సామాన్యులకు ఊరట:
ధర తగ్గింది కమర్షియల్ సిలిండర్ కదా.. అయినప్పటికీ సామాన్యులకు కొంత ఊరటే అనుకోవచ్చు. ఎందుకంటే.. కమర్షియల్ సిలింటర్లను హోటళ్లు, రెస్టారెంట్లలో వాడతారు. సిలిండర్ ధర పెరిగితే.. హోటళ్లలో తినుబండారాల ధరలు పెంచేస్తారు. ధర తగ్గింది కాబట్టి.. ఆహార పదార్థాల ధరలు పెరగవు అనుకోవచ్చు. ఐతే.. ఇళ్లలో వాడుకునే సిలిండర్ ధర పెరగకపోవడం మరో ఉపశమనం అనుకోవచ్చు.
LPG సిలిండర్ ధరను ఎవరు నిర్ణయిస్తారు?
భారతదేశంలో, LPG (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ల ధరలను ప్రభుత్వ చమురు కంపెనీలు (OMCలు - ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు) నిర్ణయిస్తాయి. ఈ కంపెనీలు ఏవంటే..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)
ఈ కంపెనీలు ప్రభుత్వ విధానం, అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా ఎల్‌పిజి సిలిండర్ల కొత్త ధరలను ప్రతి నెల 1వ తేదీన నిర్ణయిస్తాయి.