మనదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు దాటినా.. ఇంకా ప్రాథమిక సౌకర్యాలు లేని గ్రామాలు ఎన్నో. గుడి, బడి, రోడ్డు, బస్సు, ఆస్పత్రి ఇలాంటి మౌలిక వసతులు లేని ఊర్లు ఎన్నో. అలాంటిదే అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని ముద్దలాపురం గ్రామం. స్వాతంత్ర్యం సాధించిన నాటి నుంచి ఈ ఊరికి బస్సు సౌకర్యం లేదు. దీంతో గత 75 ఏళ్లుగా ఈ ఊరివాసులు ఆర్టీసీ బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేక స్కూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులు, వ్యాపారం ఇతరత్రా పనుల కోసం బయటకు వెళ్లేందుకు స్థానికులు చాలా కాలం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వారి ఎదురుచూపులకు ఇన్నేళ్లకు తెరపడింది. ఆ గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోకలు మొదలయ్యాయి.
తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించాలంటూ ముద్దలాపురం గ్రామస్థులు ఇటీవల స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లారు. బస్సు సౌకర్యం లేకపోవటంతో విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తమ సమస్యలను వివరించారు. దీనిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పందించడంతో ఆ మారుమూల గ్రామానికి ఆర్టీసీ బస్సు ఏర్పాటయింది. తాజాగా ముద్దులాపురం కళ్యాణదుర్గం బస్సు సర్వీసును అమిలినేని సురేంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు.
మరోవైపు 75 ఏళ్లకు తమ గ్రామంలోకి ఆర్టీసి బస్సు రావటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి ఎన్నో ఏళ్ల నుంచి బస్సు సౌకర్యం లేదని.. ఇన్నేళ్లకు బస్సు ఏర్పాటు చేయడంపై ముద్దలాపురం విద్యార్థులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. బస్సు సర్వీసును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బందులు పడకూడదని ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే సురేంద్రబాబు వెల్లడించారు. ముద్దలాపురం ప్రజలు బస్సు సర్వీసు లేక ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని.. అలాగే మంత్రి నారా లోకేష్ చొరవతో సకాలంలో బస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. త్వరలోనే రోడ్లన్నీ బాగు చేయిస్తామని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు.