తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో అక్కడక్కడా ఆలయాలపై దాడులు జరుగుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల ఆకతాయిలు ఇలాంటి పనులు చేస్తుంటే.. మరి కొన్నిచోట్ల గుప్తనిధుల కోసం అన్వేషిస్తున్న దురాశపరులు ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో వెంకటేశ్వరస్వామి ఆలయంపై దాడి జరిగింది. పల్నాడు జిల్లా క్రోసూరులో ఊరి చివరన వెంకటేశ్వరస్వామి గుడి ఉంది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఈ గుడిలోపలి విగ్రహాలను ధ్వంసం చేశారు. విగ్రహాలను బయట పడేసి, ఆలయంలో ఉన్న వస్తువులకు నిప్పటించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. శనివారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు.. ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అయితే దేవాలయాలు, ప్రార్థన స్థలాలపై దాడులు చేస్తే సహించేది లేదని ఓ వైపు ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా కూడా అక్కడక్కడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గుప్తనిధుల కోసం కక్కుర్తిపడి కొంతమంది ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడం చూస్తుంటాం. కానీ పల్నాడు జిల్లా ఘటనలో విగ్రహాలను బయటపడేయటం, ఆలయంలోని వస్తువులను కాల్చివేయడం చూస్తే ఇది ఎవరో కావాలని చేసిన పనిగా ఊరిజనం అనుమానిస్తున్నారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. మరోవైపు క్రోసూరులో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై స్థానికులు, హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. విగ్రహాన్ని ధ్వంసం చేసినదుండగులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలంటూ రోడ్డుపై బైఠాయించాయి.