ఇటీవల కాలంలో సెల్‌ఫోన్ దొంగలు రెచ్చిపోతున్నారు. చేతుల్లోని ఫోన్లు అమాంతం ఎత్తుకెళిపోతున్నారు. రోడ్లుపై ఫోన్లు మాట్లాడుతూ వెళ్తున్న క్రమంలో బైక్‌లపై వచ్చి రెప్పపాటు కాలంలో చోరీలు చేస్తున్నారు. ఇక రైల్వే స్టేషన్లలో ట్రైన్లు కదిలిన క్షణాల వ్యవధిలోనే ప్రయాణికుల సెల్‌ఫోన్లు కొట్టేస్తున్నారు. ఇటువంటి వీడియోలు ఇటీవల కాలంలో అనేకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఫోన్లు పోగొట్టున్న వారు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేసే సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ ఫిర్యాదు చేసిన వాటి రికవరీ రేట్ తక్కువే. అయితే హైదరాబాద్ పోలీసుల మాత్రం పోగొట్టుకున్న ఫోన్ల రికవరీలో సత్తా చాటారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫోన్లు పోగొట్టుకున్న పలువురు బాధితులకు రికవరీ చేసి అప్పగించారు. నెలరోజుల్లోనే రూ.2.55 కోట్ల విలువైన 1190 ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్) కె.నరసింహా.. ఫోన్లు చోరీకి గురైతే సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటీ రిజిస్టర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వెంటనే స్పందించి ఫిర్యాదు చేస్తే.. ఫోన్లు రికవరీ చేసేందుకు ఛాన్స్ ఉంటుందన్నారు. ఇటీవల కాలంలో సెల్‌ఫోన్ చోరీలు ఎక్కువయ్యాయని.. ఫోన్లు పోగొట్టున్న వారు నిరాశ చెందకుండా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాటిని రికవరీ చేస్తామన్నారు.
ఇక నగరంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయన్న డీసీపీ.. సైబర్ నేరగాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అసలు డిజిటల్ అరెస్టులనేవే ఉండవని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. వీడియోకాల్ ద్వారా ఈడీ, సీబీఐ పేరు, డ్రగ్స్ సరఫరా, అనుమానాస్పద పార్సిల్ పేరుతో ఎవరైనా డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు బెదిరిస్తే వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఏవైనా కేసుల్లో నిందితులను అరెస్టు చేయాల్సి వస్తే ముందుగా పోలీసులు నోటీసులు జారీ చేస్తారనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ఫోన్లు చేసి మిమ్మల్ని అరెస్టు చేస్తామని చెబితే ఎవరూ నమ్మెుద్దన్నారు. ఇక పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి పొందిన వారు పోలసులకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇక మళ్లీ దొరకవనుకున్న ఫోన్లు తిరిగి అప్పగించినందుకు వారికి హ్యాట్సాప్ చెప్పారు.