డిస్కమ్‌లపై విద్యుత్తు కొనుగోళ్ల భారం నానాటికీ పెరిగిపోతోంది. ఈ నెల 5వ తేదీలోగా రూ.6,816 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2019 నుంచి 2024 మధ్యకాలంలో బహిరంగ మార్కెట్లో స్వల్పకాలిక విద్యుత్తు కొనుగోళ్లను వైసీపీ ప్రభుత్వం చేస్తూ వచ్చింది. బొగ్గు కొరత, ధరల బూచీ చూపిసూ ఏపీజెన్కో థర్మల్ విద్యుత్తు ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించేస్తూ వచ్చింది. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్కేంద్రంలో విదేశీ బొగ్గును మాత్రమే వాడాల్సి ఉన్నందున ఇక్కడ ఉత్పత్తిని దాదాపు నిలిపేశారు. బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కరెంటును కొంటూ ఆ భారాన్ని ఇంధన సర్దుబాటు పేరిట వినియోగదారులపై వేయడం అలవాటుగా మారింది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక జెన్కో విద్యుదుత్పత్తి కేంద్రాలు గరిష్ఠ స్థాయిలో ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. అయినా రాత్రిపూట పీక్ సమయంలో డిమాండ్ పెరుగుతుండటంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్తు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇలా జనవరి నెలలో రూ.2,201.61 కోట్లు, అంతకుముందు కొనుగోలు చేసిన విద్యుత్ బకాయిలు రూ.4,614.09 కోట్లు... మొత్తం రూ.6,815.7 కోట్లను ఈ నెల ఐదో తేదీలోగా చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. డిస్కమ్‌లు నిధుల కొరతలో ఉన్నందున ఈ మొత్తాన్ని ప్రభుత్వం సర్దుబాటు చేయాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు.