కుంభమేళాలో తొక్కిసలాటపై విచారణ జరిపేందుకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. తొలుత అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. ప్రయోగరాజ్‌లో మౌనీ అమావాస్య సందర్భంగా జరిగిన పుణ్యస్నానాల్లో 30 మంది మరణించడంపై న్యాయవాది విశాల్ తివారీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పరిశీలించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం..ఇది దురదృష్టకర సంఘటన అని వ్యాఖ్యానించింది. అయినా తొలుత హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని తెలిపింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ దీనిపై ఇప్పటికే అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలయిందని తెలిపారు.