విశాఖపట్నం మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊటగడ్డ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో దంపతులను అడ్డగించిన ముగ్గురు అసభ్యకరంగా ప్రవర్తించి వేధించారు. వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్నా వెంటపపడ్డారు. బయటకు ఈడ్చుకువచ్చి దాడికి పాల్పడ్డ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... ...మండంగి వంశీ (24), అతడి భార్య నాలుగు నెలలుగా ఊటగడ్డ ప్రాంతంలో అద్దె ఇంటిలో ఉంటున్నారు. వారు ఆదివారం సీతంపేటలో ఉన్న అతని బావ ఇంటికి వెళ్లి రాత్రి 11.30 ప్రాంతంలో తిరిగి వచ్చారు. ఆటో దిగి నడుచుకుంటూ ఇంటికి వెళుతుండగా సమీపంలోని బ్రిడ్జి దగ్గర ఉన్న ముగ్గురు అడ్డగించారు. మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారు.
అక్కడ నుంచి దంపతులు పరుగున ఇంటికి చేరుకున్నారు. ఇంటి యజమాని వద్దకు వెళ్లి తలదాచుకున్నారు. దంపతులను ఆ ముగ్గురూ వెంబడించి ఇంటి తలుపులపై ఇటుక బెడ్డలు, రాళ్లు విసిరారు. తలుపులు విరగ్గొట్టి లోపలకు వెళ్లి...అతడిని బయటకు ఈడ్చుకువచ్చి తీవ్రంగా కొట్టారు. వారిని అడ్డగించిన ఇంటి యజమానిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో దంపతులు స్థానికుల సహాయంతో పోలీసులను ఆశ్రయించారు. దాడికి పాల్పడిన వారిలో రౌడీషీటర్ ఉన్నట్టు చెబుతున్నారు. మహారాణిపేట కేసు నమోదుచేసి దర్యాపు జరుపుతున్నారు.
![]() |
![]() |