రాష్ట్రంలో మహిళల జోలికి ఎవరొచ్చినా, అబలలపై అఘాయిత్యాలకు పాల్పడినా మరణశిక్ష నుంచి తప్పించుకోలేరని డీజీపీ హరీ్‌షకుమార్ గుప్తా హెచ్చరించారు. ఇటీవల అన్నమయ్య, గుంటూరు, పల్నాడు సహా పలు జిల్లాల్లో మహిళలపై జరిగిన దాడులను రాష్ట్ర పోలీసుశాఖ సీరియ్‌సగా తీసుకుంది. ఈ దాడులకు పాల్పడినవారిని అరెస్టు చేసి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా వీలైనంత త్వరగా మరణశిక్ష పడేలా పకడ్బంధీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, న్యాయనిపుణులతో చర్చించిన డీజీపీ మహిళలపై నేరాలకు పాల్పడేవారికి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ఎక్కడికక్కడ నిఘా పెంచాలని, సైకో రోమియోలపై ప్రత్యేక నిఘా పెట్టి కట్టడి చేయాలని క్షేత్రస్థాయి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. న్యాయస్థానాలు, న్యాయవాదులు, జైళ్లు, ఎన్‌జీవోలు, మహిళా సంఘాలు, సమాజంలో బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తితో సమన్వయం చేసుకుంటూ దేశంలోనే మహిళలకు అత్యంత రక్షణ ఉన్న రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు. హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ ఒక్క మహిళ భయపడాల్సిన అవసరం లేదని, ఏ చిన్న ఆపద ఉన్నా వెంటనే పోలీసులను సంప్రదిస్తే పూర్తి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఆడబిడ్డల విషయంలో తమ బిడ్డలు అదుపు తప్పకుండా యువకుల తల్లిదండ్రులు కూడా జాగ్రత్త పడాలని, వారి వల్ల కాకపోతే పోలీసులతో కౌన్సెలింగ్ ఇప్పించేందుకు కూడా సంకోచించవద్దని సూచించారు. మైనర్లు, వృద్ధులపై యాసిడ్ దాడులు, లైంగిక వేధింపులకు పాల్పడేవారి వయసు 20 నుంచి 75 సంవత్సరాల వరకు ఉంటోందని, వీరి వల్ల బాధిత కుటుంబాలతోపాటు సమాజంలోనూ శాంతి, సామరస్యాలకు విఘాతం కలుగుతోందని, ప్రజల్లో భయం, అభద్రతా వాతావరణం నెలకొంటోందని చెప్పారు.
![]() |
![]() |