తిరుమలలో అన్నదాన సత్రం వద్ద తొక్కిసలాటలో ఓ బాలుడు మృతిచెందాడు అంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టం చేసింది. ఇది ఫేక్ న్యూస్ అని టీటీడీ నేడు ఓ ప్రకటనలో వెల్లడించింది. వాస్తవం ఏంటో కూడా బోర్డు వివరించింది. బెంగళూరుకు చెందిన మంజునాథ్ అనే 16 ఏళ్ల బాలుడు కొన్నేళ్లుగా హృదయ సంబంధ సమస్యతో బాధపడుతున్నాడని, అతడు ఈ నెల 22న తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం వద్ద భోజనం చేసిన అనంతరం కుప్పకూలిపోయాడని తెలిపింది. తమ సిబ్బంది అతడిని వెంటనే అశ్విని హాస్పిటల్ కు తీసుకెళ్లారని, అక్కడ్నించి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారని టీటీడీ తన ప్రకటనలో వివరించింది. దురదృష్టవశాత్తు ఆ బాలుడు మృతి చెందాడని వెల్లడించింది. అయితే, అన్నదానం క్యూలో తొక్కిసలాట జరిగి బాలుడు మరణించాడని దుష్ప్రచారం చేస్తున్నారని బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ, భక్తుల మనోభావాలు దెబ్బతీసే వారిపై కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
![]() |
![]() |