ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాట్ సమ్మర్‌లో కూల్ కూల్‌గా,,,మీరు తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు

Life style |  Suryaa Desk  | Published : Fri, Feb 28, 2025, 11:11 PM

ఎండాకాలం మొదలైంది. ఇప్పటికే ఎండలు దంచి కొడుతున్నాయి. వేసవి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఆరోగ్యానికి కూడా అంతే సవాలుగా ఉంటుంది. మండే ఎండలు, వేడి, చెమట మన శక్తిని హరించడమే కాకుండా వివిధ అనారోగ్య సమస్యల్ని తెచ్చి పెడతాయి. కడుపు నొప్పి, శరీరం నిర్జలీకరణం, చర్మ సమస్యలు, బలహీనమైన రోగనిరోధక శక్తి వంటి సమస్యల్ని కలిగిస్తాయి. వేసవిలో అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని అవసరమైన మార్పులు చేసుకోవాలి.


ఇప్పటి నుంచే ఆహారపు అలవాట్లను మెరుగుపర్చుకుంటే రాబోయే రోజుల్లో ఎండల్ని తట్టుకోవచ్చు. అంతేకాకుండా సమ్మర్‌లో తాజాగా, చురుగ్గా ఉండలరు. వేసవి కాలం అంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలనుకుంటే ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.


నీటి పరిమాణాన్ని పెంచండి


వేసవిలో శరీరానికి ఎక్కువగా చెమట పడుతుంది. దీనివల్ల శరీరంలో నీరు, ఎలక్ట్రోలైట్ల లోపం ఏర్పడుతుంది. దీంతో నిర్జలీకరణం, తక్కువ రక్తపోటు, అలసట, తలనొప్పి, వడదెబ్బ వంటి సమస్యలు వస్తాయి. రోజంతా కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగండి. కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీరు, మామిడి పన్నా, మజ్జిగ వంటి సహజ పానీయాలు ఎక్కువ తాగండి. ఖాళీ కడుపుతో ఎక్కువ చల్లగా ఉన్న నీరు తాగడం మానేయండి. ఎందుకంటే ఇది గొంతు నొప్పికి కారణమవుతుంది. మీరు తరుచుగా నీరు తాగడం మర్చిపోతుంటే మీ ఫోన్‌లో వాటర్ తాగే రిమైండర్‌ను సెట్ చేసుకోండి లేదా ఎల్లప్పుడూ మీతో ఒక వాటర్ బాటిల్‌ను ఉంచుకోండి.


స్పైసీ, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి


వేసవిలో ఎక్కువగా స్పైసీ ఫుడ్స్, వేయించిన ఆహారాలు తీసుకోవడం మానేయండి. ఈ ఆహారాలు జీర్ణమవ్వడం కష్టంగా ఉంటుంది. దీనివల్ల అసిడిటీ, ఉబ్బరం, కడుపు నొప్పి, ఫుడ్ పాయిజినింగ్ వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట స్పైసీ, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి. గంజి, కిచిడి, రాగి జావా, పండ్లు, కూరగాయలు వంటి తేలికగా జీర్ణమయ్యే ఆహారాల్ని మీ డైట్‌లో చేర్చుకోండి. ఆహారంలో ఆకుకూరలు, మొలకలు, సలాడ్ల పరిమాణాన్ని పెంచండి. అంతేకాకుండా పెరుగు తినడం అలవాటు చేసుకోండి. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా ఒంట్లోని వేడిని తరిమికొడుతుంది. రాత్రి భోజనంలో తేలికగా, సులభంగా ఆహారాన్ని తినండి. దీంతో ఉదయం పూట మీ కడుపు తేలికగా ఉంటుంది.


సీజనల్ పండ్లు, కూరగాయలు తినండి


వేసవిలో దొరికే పండ్లు, కూరగాయల్లో సహజంగానే ఎక్కువ నీరు ఉంటుంది. ఇది శరీరానికి హైడ్రేషన్, అవసరమైన పోషణ అందిస్తుంది. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తాయి. పుచ్చకాయ, సీతాఫలం, బొప్పాయి, నారింజ, మామిడి, పైనాపిల్ వంటి పండ్లను తినండి. ఇవి శరీరానికి కావాల్సిన తేమను, శక్తిని అందిస్తాయి. దోసకాయ, కాకరకాయ, టమాటా, సొరకాయ, గుమ్మడికాయ, పాల కూర వంటి కూరగాయల్ని ఆహారంలో భాగం చేసుకోండి.


కెఫిన్, కూల్‌డ్రింక్స్, ఆల్కహాల్‌కు టాటా చెప్పండి


వేసవిలో కూల్‌డ్రింక్స్, ఆల్కహాల్, టీ, కాఫీ వంటి డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటారు. అయితే, ఇవి శరీరానికి మేలు చేయకపోగా నష్టాన్ని మిగులుస్తాయి. ఈ డ్రింక్స్ వల్ల డీహైడ్రేషన్, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. కూల్‌డ్రింక్స్‌కి బదులు ఇంట్లోనే తయారు చేసుకోదగిన మామిడి పన్నా, నిమ్మరసం, పండ్ల రసాలు, సత్తు (శనగపిండి షర్భత్) తాగండి. టీ, కాఫీ మొత్తాన్ని తగ్గించి గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తీసుకోండి. ఆల్కహాల్, కెఫిన్ డ్రింక్స్ తీసుకోవడం మానేయండి. అవి శరీరంలో నీటి నిలుపుదలని పెంచుతాయి. టీ లేదా కాఫీ తాగాలనిపించనప్పుడల్లా ఒక గ్లాస్ నీరు తాగండి.


పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం


వేసవిలో పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పప్పుధాన్యాలు, పెసర పప్పు, పనీర్, టోఫు, మొలకలు వంటి ఆరోగ్యకరమైన ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోండి. ఆహారంలో అవిసె గింజలు, చియా గింజలు, బాదం వంటి గింజలు, విత్తనాలను చేర్చుకోండి. తృణధాన్యాలు, మల్టీ గ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ రైస్ తినండి. వీటిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్ ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుబడుతుంది. అంతేకాకుండా శరీరం చల్లబడుతుంది. శరీరానికి పూర్తి పోషకాహారం లభించడానికి, ఒకేసారి తినకండి. చిన్న చిన్న విరామాల్లో భోజనం తీసుకోండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa