ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఎం ధన్ ధాన్య కృషి యోజనతో ఇక ఆ ఇబ్బందులు తప్పినట్లే

national |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 07:25 PM

ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను వేగంగా అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. దేశంలో వ్యవసాయ అభివృద్ధికి, రైతుల సంక్షేమం కోసం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చొరవ చూపుతోందని ఈ సందర్భంగా ప్రధాని వెల్లడించారు. దేశంలో వ్యవసాయ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే తక్కువ దిగుబడులు వచ్చే ప్రాంతాలను గుర్తించి.. అక్కడి రైతులకు ప్రోత్సాహం అందించి.. వారిని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇందుకోసమే ఇటీవల ప్రవేశపెట్టిన 2025-2026 బడ్జెట్‌లో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను తీసుకువచ్చినట్లు వివరించారు.


2025-26 బడ్జెట్‌ వెబినార్‌లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈ పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం గురించి.. దాన్ని తీసుకురావాల్సిన అవసరం గురించి వెల్లడించారు. దేశంలో వ్యవసాయ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని.. అందుకే దేశంలోని తక్కువ పంట దిగుబడి, ఉత్పాదకత ఉండే వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందించేందుకు ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా మొదట ఎంపిక చేసిన 100 జిల్లాల్లో అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు.


 2025-26 బడ్జెట్‌కు సంబంధించి వ్యవసాయం-గ్రామీణాభివృద్ధిపై ఏర్పాటు చేసిన వెబినార్‌లో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన వ్యవసాయ సంబంధ కార్యక్రమాలను ముందుగా ప్రారంభించాలని ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి పెరిగిందని.. అయినప్పటికీ దేశ వినియోగంలో 20 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. ప్రజల్లో పోషకాహారంపై అవగాహన రోజురోజుకూ పెరుగుతోందని.. అందుకు అనుగుణంగా ఆహార ధాన్యాలు, పాడి పరిశ్రమ, మత్స్య ఉత్పత్తులు కూడా మరింత పెరగాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.


ఇక రైతులకు పెట్టుబడి సాయం కింద కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా దాదాపు రూ.3.75 లక్షల కోట్లు అకౌంట్లలో జమ చేసినట్లు ప్రధాని మోదీ గుర్తు చేశారు. 10 ఏళ్ల క్రితం వ్యవసాయ ఉత్పత్తి దాదాపు 265 మిలియన్‌ టన్నులు మాత్రమే ఉండేదని.. కానీ ప్రస్తుతం అది 330 మిలియన్‌ టన్నులకు పెరిగినట్లు చెప్పారు. ఉద్యానవన ఉత్పత్తి 350 మిలియన్‌ టన్నులను దాటిందని వెల్లడించారు. గత 10 ఏళ్లలో ఐసీఏఆర్‌ ఆధ్వర్యంలో 2900కి పైగా కొత్త రకాల పంటలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. అయితే కొత్త రకాలు రైతులకు అందుబాటులో ధరలో ఉండేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.


ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన


రైతులు మెరుగైన, నాణ్యమైన విత్తనాలను ఉపయోగించి.. భూసారం తగ్గకుండా చూసుకుంటూ.. అధిక ఉత్పత్తిని పండించే కొత్త మార్గాలను అన్వేషించడం.


రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంటల మార్పిడితో వివిధ రకాల పంటలను పండించడానికి ప్రోత్సాహం. ఇది భూ సారం పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది.


రైతులు పండించిన పంటను నిల్వచేయడానికి గోడౌన్‌లను నిర్మించడం.


రైతుల పంట పొలాలకు నీటిని అందించడం వల్ల సాగు విస్తీర్ణం పెంచడం.


రైతులు తమ పంటలు పండించేందుకు కావాల్సిన పెట్టుబడి కోసం సులువుగా రుణాలు అందించడం.


దేశంలోని 100 జిల్లాల్లో సుమారు 1.7 కోట్ల మంది రైతులకు ఈ పథకం కింద ప్రయోజనం కలగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa