సార్వత్రిక ఎన్నికల గడువు ముంచుకొస్తోంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ టికెట్‌లపై స్పష్టత వచ్చినవారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. టికెట్ ఎటూ తేలని నాయకులలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సారి ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి జనసేన రంగంలోకి దిగుతోంది. టీడీపీ, వైసీపీలతో పొత్తు ఉండదు.. వామపక్ష పార్టీలతో కలసి నడుస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. అదే రోజున అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించాలని ఆ పార్టీ భావిస్తోందని సమాచారం. అందులో భాగంగా వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై కసరత్తుమొదలుపెట్టారు. జిల్లాలో జనసేన, సీపీఐ, సీపీఎం ఏయే స్థానాల్లో పోటీ చేయాలో సమాలోచన చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో కర్నూలు, నంద్యాల లోక్‌సభ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాల్లో జనసేన, వామపక్షాలు పోటీ చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 24, 25, 26 తేదీలలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జిల్లాలోపర్యటించారు. జనసైనికుల్లో జోష్ నింపారు. 25వ తేదీన కర్నూలు, నంద్యాల లోక్‌సభ స్థానాల పరిధిలోని నాయకులతో విడివిడిగా భేటీ అయ్యారు. పార్లమెంట్‌స్థానాల పరిధిలో పార్టీ బలాలు, బలహీనతలపై సమీక్షించారు. గెలిచే అవకాశాలు, ఆశావహుల వివరాలు సేకరించారు. టీడీపీ, వైసీపీ టికెట్లు రాని నాయకులు, తటస్థులను పార్టీలోకి తీసుకుంటే ఎలా ఉంటుందని చర్చించారు. వామపక్షాలు ఆశిస్తున్న స్థానాలు మినహా మిగిలిన చోట్ల పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలనిజనసేన కార్యకర్తలు, ముఖ్య నాయకులకు పవన్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. జిల్లా నుంచి జనసేన టికెట్ ఆశిస్తూ 130 మందికి పైగా దరఖాస్తు చేశారు. వీరిగురించి రహస్యంగా సమాచారం సేకరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa