పీరియడ్స్.. ప్రతి నెలా మహిళలు ఎదుర్కొనే ఓ సమస్య. కొద్దిమందిలో పీరియడ్స్ సక్రమంగా వస్తే మరికొద్ది మందిలో రెగ్యులర్‌గా రావు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, బ్లీడింగ్ సరిగా కాకపోవడం వంటి సమస్యలను ఫేస్ చేస్తుంటారు. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇందులో టీనేజ్ అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం ఇది సాధరణ సమస్యగా మారినప్పటికీ.. దీని కారణంగా అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతూ ఉంటారు.
పీరియడ్స్ సాధారణంగా సుమారుగా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకి ఒకసారి వస్తాయి. నెలసరికి మధ్య ముప్ఫై ఐదు రోజుల కంటే ఎక్కువ సమయం ఉంటే.. దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు. పీరియడ్స్ అనేది ఒక ఒక సంక్లిష్టమైన శారీరక ప్రక్రియ: ; హైపోథాలమస్, పిట్యూటరీ గ్రంధులు, అండాశయం దీన్ని నియంత్రిస్తుంది. ఈ ప్రక్రియలో కొంచెం అసమతుల్యత ఏర్పడినా.. నెలసరిలో ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి కారణాలేంటి, అసలు ఇవి ఆరోగ్యం గురించి ఏం చెబుతున్నాయని డాక్టర్ మంజుల ఎన్వీ, కన్సల్టెంట్ - ప్రసూతి & గైనకాలజీ విభాగం, రామయ్య మెమోరియల్ హాస్పిటల్ వివరించారు. డాక్టర్ ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం.
హార్మోన్ల అసమతుల్యత
హార్మోన్ల అస్థిరమైన ఉత్పత్తి, హార్మోన్ల అసమతుల్యత కారణంగా.. పీరియడ్స్ క్రమం తప్పవచ్చు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ మధ్య అసమతుల్యత ఋతుచక్రానికి అంతరాయం కలిగిస్తుంది. క్రమరహిత ఋతుచక్రాలకు మరో సాధారణ కారణం పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ . ఇది పునరుత్పత్తి వయస్సు గల దాదాపు 10% మంది మహిళలను ప్రభావితం చేస్తుంది. దీని వలన ఆండ్రోజెన్ ఉత్పత్తి, క్రమరహిత అండోత్సర్గము జరుగుతుంది. ఇది అండాశయాలను ప్రభావితం చేసే హార్మోన్ల రుగ్మత. క్రమరహిత పీరియడ్స్, మొటిమలు, బరువు పెరగడం, జుట్టు రాలడం వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి.
థైరాయిడిజం
అదనంగా, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం రెండూ బుతుచక్రంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి జీవక్రియను నియంత్రించడానికి పని చేస్తుంది. అంతేకాకుండా ఇది పరోక్షంగా పునరుత్పత్తి హార్మోన్లను ప్రభావితం చేస్తుంది.
రోజువారీ అలవాట్లు
రోజువారీ అలవాట్లు, చెడు జీవనశైలి కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కారణాలు. అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా.. నెలసరి క్రమం తప్పవచ్చు. శారీరక శ్రమ లేకపోవడం, చెడు ఆహార అలవాట్లు, నిద్రలేమి కారణంగా పీరియడ్స్ మిస్ అవుతాయి. మానసికంగా, శారీరకంగా యాక్టివ్‌గా ఉంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది.
ఒత్తిడి
ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి దీర్ఘకాలిక ఒత్తిడి మరో కారణం. ఈ రోజుల్లో ఎంతో మంది ఒత్తిడి కారణంగా సతమతమవుతున్నారు. కౌమారదశలో ఉన్నవారు తమ విద్యాపరమైన ఒత్తిడి, కుటుంబ ఒత్తిడి, తోటివారి ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడి వంటి అనేక రకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తుంది. దీని కారణంగా పీరియడ్స్ క్రమం తప్పుతాయి. ఒత్తిడి కార్టిసాల్ స్థాయిల్ని పెంచుతుంది. ఇది బుతుచక్రానికి అంతరాయం కలిగిస్తుంది.
ఇవి కూడా కారణాలు
ఎండోమెట్రియోసిస్, గర్భాశయ పాలిప్స్, ప్రాథమిక అండాశయ లోపం వంటి అనేక స్త్రీ జననేంద్రియ పరిస్థితులు పునరుత్పత్తి అవయవాలను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా క్రమరహిత రక్తస్రావం నమూనాలు ఏర్పడతాయి.
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
కొన్ని సార్లు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆందోళన కలిగించకపోయినా కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. బుతుచక్రం సక్రమంగా రాకపోవడం, ఎక్కువకాలం రక్తస్రావం కావడం, 7 రోజుల కంటే ఎక్కువ కాలం ఉండే పీరియడ్స్, పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పులు, పీరియడ్స్ ఆగిపోయిన రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యనిపుణుల్ని సంప్రదించాలి. ఆరోగ్య నిపుణులు హార్మోన్, థైరాయిడ్ స్థాయిల్ని తనిఖీ చేయడానికి రక్త పరీక్షలు, పునరుత్పత్తి అవయవాల్ని అంచనా వేయడానికి అల్ట్రాసౌండ్‌లు, టోటల్ బాడీ చెక్ వంటి పరీక్షల్ని సిఫార్సు చేస్తారు.
డాక్టర్ సలహా
క్రమరహిత ఋతుస్రావాలు తరచుగా మీ మొత్తం ఆరోగ్యం గురించి ముఖ్యమైన సందేశంగా పనిచేస్తాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల వచ్చే మార్పులను అసౌకర్యంగా లేదా సాధారణ కారణాలుగా తోసిపుచ్చే బదులు, శరీరం అందించే విలువైన సమాచారంగా వాటిని పరిగణించడం అత్యవసరం. ఈ సంకేతాలకు శ్రద్ధ చూపి తగిన వైద్య సాయం పొందడం ద్వారా సమస్యను పరిష్కరించవంటున్నారు నిపుణులు. వీటిని సకాలంలో గుర్తించడం వల్ల సరైన పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంతేకాకుండా జీవన నాణ్యతను మెరుగుపర్చవచ్చు. మిస్ పీరియడ్స్‌ను చికిత్స చేయడానికి, అంతర్లీన కారణాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అనేక కారణాల వల్ల నెలసరి సమస్యలకు దారితీస్తాయి. ఇది దీర్ఘకాలికంగా మారినట్లయితే, డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa