ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ

international |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 11:31 PM

కెనడా నూతన ప్రధాన మంత్రిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. లిబరల్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలతో పాటు ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్టు జస్టిన్ ట్రూడో జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో లిబర్ పార్టీ అధ్యక్ష ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన పార్టీ ఓటింగ్‌లో కెనడా రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ మార్క్‌ కార్నీ విజయం సాధించారు. పార్టీ సారథి కోసం పోటీలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్‌ను ఓడించి పార్టీ నూతన సారథిగా ఎన్నికయ్యారు. మొత్తం 150,000 మంది పాల్గొన్న ఓటింగ్‌లో కార్నేకు 131,674 ఓట్లు అంటే దాదాపు 86 శాతం వచ్చాయి. ఇక, క్రిస్టియా ఫ్రీలాండ్‌‌కు 11,134, కరినా గౌల్డ్‌కు 4,785, ఫ్రాంక్‌ బేలిస్‌కు 4,038 ఓట్లు మాత్రమే దక్కాయి.


అమెరికా నుంచి సుంకాల ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ.. కెనడా పాలన పగ్గాలను కార్నీ చేపట్టనున్నారు. 1965లో ఫోర్ట్‌ స్మిత్‌లో జన్మించిన మార్క్ కార్నే... హార్వర్డ్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. అనంతరం గోల్డ్‌మన్‌ శాక్స్‌లో 13 ఏళ్లు పనిచేశారు. 2003లో బ్యాంక్‌ ఆఫ్‌ కెనడా డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఏడాది తర్వాత 2004లో ఆ బాధ్యతల నుంచి వైదొలగిన కార్నే.. కెనడా ఆర్థిక మంత్రి పదవిని చేపట్టారు. అయితే, 2008 ఫిబ్రవరి 1న సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు.


కెనడా కేంద్ర బ్యాంకు గవర్నర్‌గా ఉన్నప్పుడు 2008-09 ప్రపంచ ఆర్థిక సంక్షోభం పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. వడ్డీ రేట్లను సున్నాకు తగ్గించి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణకు అవసరమైన చర్యలను సమన్వయపరచడంలో కీలకంగా వ్యవహరించి ప్రశంసలు అందుకున్నారు. ఇక, 300 ఏళ్ల చరిత్ర కలిగిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ గవర్నర్‌గా 2013లో ఎన్నికయ్యారు. దీంతో ఆ బ్యాంకుకు మొట్టమొదటి నాన్‌-బ్రిటిష్‌ గవర్నర్‌గా ఆయన రికార్డులకెక్కారు. అంతేకాదు, జీ7 కూటమిలోని రెండు సెంట్రల్‌ బ్యాంకులకు నాయకత్వం వహించిన వ్యక్తిగానూ నిలిచారు.


ఏడేళ్ల పాటు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ గవర్నర్‌గా కొనసాగిన ఆయన 2020లో తప్పుకున్నారు. అనంతరం ఐక్యరాజ్యసమితి ఆర్థిక, వాతావరణ మార్పుల విభాగం రాయబారిగా సేవలందించారు. జస్టిన్ ట్రూడో రాజీనామా ప్రకటన అనంతరం.. లిబరల్ పార్టీలో ప్రధాని రేసులో ఉన్న నలుగురిలో కార్నీ అత్యంత ఆదరణ పొందారు. దీంతోపాటుగా ఎక్కువ విరాళాలు సేకరించిన అభ్యర్థిగానూ ఆయన నిలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ పోటీచేయని, క్యాబినెట్‌లో పనిచేసిన అనుభవం లేని కార్నీ.. ట్రూడో వారసుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa