రాష్ట్రంలో విద్యుత్ రంగానికి గత ఐదేళ్లలో చీకట్లు ముసిరాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాము తొమ్మిది నెలల్లోనే పరిస్థితిని గాడిన పెట్టామని, ప్రతి ఇంటి నుంచీ విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజలకు ఆదాయ వనరుగా మార్చనున్నామని తెలిపారు. గురువారం శాసనసభలో విద్యుత్ రంగంపై జరిగిన లఘు చర్చలో చంద్రబాబు ప్రసంగించారు. ‘‘గత వైసీపీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, ఒక వ్యక్తి(జగన్) మూర్ఖపు చర్యల వల్ల రాష్ట్ర విద్యుత్ రంగంపై వేల కోట్ల రూపాయల భారం పడింది. ప్రజలు విద్యుత్ బిల్లులు ముట్టుకుంటే షాక్ కొట్టేలా తొమ్మిది సార్లు ధరలు పెంచిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కింది. ఈ రంగంలో ముప్పై సంవత్సరాల క్రితమే సంస్కరణలు టీడీపీ తెచ్చింది. ఆ ఫలితాలను సొమ్ము చేసుకున్న కాంగ్రెస్ పార్టీ 2004లో ఉచిత విద్యుత్ పేరుతో తిరోగమనంలోకి ఆ రంగాన్ని తీసుకెళ్లింది. రాష్ట్ర విభజన తర్వాత లోటు విద్యుత్‌ను పూడ్చి 2018నాటికి మిగులు విద్యుత్ స్థాయికి టీడీపీ తీసుకొచ్చింది. అయితే, గత ఐదేళ్లలో అరాచక ప్రభుత్వం మళ్లీ విద్యుత్ రంగాన్ని తిరోగమనంలోని తీసుకెళ్లింది. కమీషన్ల కోసం పీపీఏలు రద్దు చేసుకుని. కేంద్రం చెప్పినా వినకుండా, హైకోర్టు మొట్టికాయలు వేసినా మొండిగా ముందుకెళ్లి అన్యాయంగా ప్రజల సొమ్ము 9వేల కోట్ల రూపాయలను ఒప్పందాల రద్దుకు చెల్లించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కీలకమైన విద్యుత్ రంగాన్ని సంస్కరిస్తున్నాం. వృథా తగ్గించి, ఉత్పత్తి పెంచి నాణ్యమైన విద్యుత్ రైతులకు పగటి పూట తొమ్మిది గంటలు ఇస్తున్నాం. ఇంధన రంగంలో పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించనున్నాం. రాబోయే నాలుగేళ్లలో విద్యుత్ చార్జీలు పెంచబోమని ప్రజలకు మాటిస్తున్నాను.’’ అని చంద్రబాబు తెలిపారు.
![]() |
![]() |