కేరళలోని కన్నూర్ జిల్లా తలస్సేరి తాలుకా మడపీడిక గ్రామానికి చెందిన 38 ఏళ్ల రజీష్ ఒక రైతు. ఫిబ్రవరి నెల ప్రారంభంలో ఒక నీటి గుంటను శుభ్రం చేస్తుండగా.. ఒక చేప అతడిని కరిచింది. ఆ చేపను స్థానికంగా కడు అని పిలుస్తారు. అయితే దాన్ని అతడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదే చేప కాటుకు అతనికి ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకేలా చేసింది. చివరికి చేప కాటుకు గురైన రజీష్ చేయిని మణికట్టు వరకు తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. మొదట్లో గాయం చిన్నదిగా కనిపించిందని.. ఆ తర్వాత కొద్ది రోజులకే అది చాలా తీవ్రంగా మారినట్లు రజీష్ వెల్లడించాడు.
గాయం చూసి స్థానికంగా కొడియేరిలో ఉన్న ప్రాథమిక ఆస్పత్రికి వెళ్లగా టెటనస్ ఇంజెక్షన్ ఇచ్చినట్లు తెలిపాడు. రోజురోజుకూ గాయం తీవ్రం కావడంతో అతని కుటుంబ సభ్యులు మహేలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మరింత మెరుగైన చికిత్స కోసం రజీష్‌ను కోజికోడ్‌కు తరలించారు. ఈ క్రమంలోనే అసలు సమస్య అక్కడ బయటపడింది. రజీష్‌కు.. గ్యాస్ గాంగ్రీన్ లేదా క్లోస్టిడియల్ మయోనెక్రోసిస్ అనే ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు కోజికోడ్ డాక్టర్లు నిర్ధారించారు. ఇది కణజాలాన్ని నాశనం చేసి.. అందులో గ్యాస్‌ని ఉత్పత్తి చేసే తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని వెల్లడించారు. అయితే అప్పటికే ఇన్ఫెక్షన్ అరచేయి వరకు వ్యాపించినట్లు గుర్తించిన డాక్టర్లు.. అతడి చేయిని తొలగించాలని పేర్కొన్నారు. లేకపోతే అది అతని మెదడును దెబ్బతీసే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో రజీష్ తన చేయిని మణికట్టు వరకు కోల్పోవాల్సి వచ్చింది.
ఈ ఘటన తర్వాత డాక్టర్లు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బురద నీటిలో పనిచేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాంటి బురద గుంటల్లో గ్యాస్ గ్యాంగ్రీన్ ఇన్ఫెక్షన్‌కు కారణం అయ్యే బ్యాక్టీరియా నివసిస్తుందని వెల్లడించారు. కలుషిత వాతావరణంలో ఏదైనా గాయాలు తగిలితే వెంటనే మెడికల్ ట్రీట్‌మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
![]() |
![]() |