ఐపీఎల్ 2025లో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో పాల్గొనేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమైంది. మార్చి 22న ఐపీఎల్ 18వ ఎడిషన్ ప్రారంభం కానుంది. అయితే మార్చి 24న తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏపీలోని విశాఖపట్నం వేదికగా జరగనుంది. దీంతో ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టు విశాఖపట్నంకు సోమవారం రాత్రి చేరుకుంది.
సాధారణంగా ఏ ఫ్రాంఛైజీ అయినా.. తాము ఆడే 14 లీగ్ మ్యాచ్‌లలో ఏడింటిన హోం గ్రౌండ్‌లో ఆడుతుంది. అయితే గత సీజన్‌లోనూ ఢిల్లీ తమ రెండు లీగ్ మ్యాచ్‌లను విశాఖపట్నం వేదికగా ఆడింది. ఈసారి కూడా అదే విధంగా షెడ్యూల్ చేయించుకుంది. ఇందులో భాగంగా మార్చి 24, మార్చి 30 తేదీల్లో జరిగే మ్యాచ్‌లలో లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. దీనికోసం విశాఖ నగరానికి చేరుకుంది.
ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను డీసీ షేర్ చేసింది. “పాత అనుబంధం కొత్త సంవత్సరం, వైజాగ్ మేము వచ్చేశాం” అని క్యాప్షన్ ఇచ్చింది. ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నేలను ముద్దాడుతున్నట్లుగా ఉన్న ఫొటోను ఈ పోస్టుకు జోడించింది. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి అని మరో పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్‌గా మారాయి.
2025 ఐపీఎల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు:
కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ (కెప్టెన్), ఫాఫ్ డుప్లెసిస్ (వైస్ కెప్టెన్), కుల్‌దీప్ యాదవ్, ట్రిస్టాన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, మిచెల్ స్టార్క్, జేక్ ఫ్రాసెర్ మెక్‌గుర్క్, నటరాజన్, ముకేశ్ కుమార్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, దర్శన్ నాల్కండే, విప్రాజ్ నిగమ్, దుష్మంత చమీర, డొనోవన్ ఫెరీరా, మన్వంత్ కుమార్, అజయ్ మండల్, మాధవ్ తివారి, త్రిపురన విజయ్
![]() |
![]() |