పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేసిన ఘనులు తండ్రీకొడుకులే. మొదటిసారి ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మధుకాన్ కాంట్రాక్ట్ సంస్థను రద్దు చేస్తే.. రెండోసారి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరిట 17 నెలలు ఏజెన్సీ లేకుండా చేశారు. వీరిద్దరి వల్లే రాష్ట్రానికి, పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం కలిగింది’ అని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టుపై జగన్ ముఠా పదే పదే అసత్యాలు వల్లెవేస్తోంది. 2020లో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల డయా ఫ్రమ్ వాల్ ధ్వంసం కావడంతో రూ.440 కోట్లు నష్టం కలిగింది. వందల కోట్ల విలువైన గైడ్ బండ్‌కు నష్టం వచ్చింది. పోలవరం చరిత్రలో ఫేజ్ 1, ఫేజ్ 2 అంటూ 41.15, 45.72 మీటర్లకు తీసుకువచ్చింది జగన్. పోలవరం కుడి, ఎడమ కాలువల నీటి సామర్థ్యం 17,500 క్యూసెక్కుల నుంచి 9 వేల క్యూసెక్కులకు, 6 వేల క్యూసెక్కులకు తగ్గించి ఉత్తరాంధ్రకు, రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్. గత ప్రభుత్వం వల్ల పోలవరానికి రూ.50 వేల కోట్లు నష్టం వాటిల్లింది. ఇంత జరిగినా ఇప్పుడు ఆ పార్టీ నేతలు అసత్యాలు పలుకుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరాన్ని పట్టాలెక్కించారు. ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రి, కేంద్ర జలవనరుల మంత్రులను కలిసి తొమ్మిది నెలల్లో రూ.12,157 కోట్లు మంజూరు చేయించారు. ఇప్పుడు అడ్వాన్సుగా రూ.5,052 కోట్లు మంజూరు చేయించారు. ప్రస్తుతం రూ.990 కోట్లతో డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎగువ కాఫర్ డ్యాముల బలోపేతానికి బట్రన్ డ్యామ్ పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి’ అని మంత్రి అన్నారు.
![]() |
![]() |