"బ్రాండ్ బాబు తిరిగి వచ్చాడు... దాంతోపాటు బ్రాండ్ వైజాగ్ తిరిగొచ్చింది. ఒక ప్రభుత్వంగా బ్రాండ్ వైజాగ్‌ను పునరుద్ధరించాలని మేము నిశ్చయించుకున్నాం. గత 10 నెలల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వంలో పరిశ్రమదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించి, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టగలిగాం. వ్యాపార అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించి, రాష్ట్రానికి పెద్దఎత్తున కంపెనీలను రప్పించగలిగాం" అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. విశాఖ బీచ్ రోడ్డులో తాజ్-వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో వరణ్ బే శాండ్స్ పేరిట నూతనంగా నిర్మించతలపెట్టిన కొత్త అత్యాధునిక హోటల్, ఆఫీస్ టవర్ కు మంత్రి లోకేశ్, తన తల్లి భువనేశ్వరితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... "వైజాగ్ ఎల్లప్పుడూ మా హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఈ నగరం కేవలం ఒక అందమైన తీరప్రాంతం మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాంటిది. దశాబ్దాలుగా వైజాగ్ మాకు అండగా నిలిచింది. ప్రపంచస్థాయి పెట్టుబడి గమ్యస్థానంగా విశాఖను అభివృద్ధి చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం. నేటి ఈ కార్యక్రమం మా దార్శనికతకు నిదర్శనం. తాజ్-వరుణ్ గ్రూప్ అధినేతలు, గౌరవనీయ పరిశ్రమ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, ఈరోజు ఇక్కడకు వచ్చిన విశిష్ట అతిథులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గత పాలకులు విధ్వంసక విధానాలతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, వ్యాపార వాతావరణానికి అపారమైన నష్టాన్ని కలిగించారు. అప్పటి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఎంతోమంది పెట్టుబడిదారులు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లారు. ప్రధాన ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయి. గత ప్రభుత్వ తిరోగమన విధానాలు ఆర్థిక స్తబ్దతకు దారితీశాయి. ఫలితంగా రాష్ట్రంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టాలని ప్లాన్ చేసిన లూలూ వంటి కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయి" అని మంత్రి లోకేశ్ అన్నారు.
![]() |
![]() |