నారా లోకేశ్ హామీ మేరకు మంగళగిరి పేద ప్రజల కల నెరవేరబోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార సమయంలో నారా లోకేశ్ తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత హక్కు కల్పిస్తూ పట్టాలు అందజేసి, మంగళగిరి పేద ప్రజల దశాబ్దాల కల నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 91,413 ఓట్ల భారీ మెజారిటీతో మంగళగిరి ప్రజలు ఆయనను గెలిపించారు. గెలిచిన మొదటి రోజు నుంచే లోకేశ్ ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే దశగా కార్యాచరణ మొదలుపెట్టారు. ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది ఇళ్ల పట్టాల సమస్య. ఎన్నో ఏళ్లుగా పేద ప్రజలు ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. వారంతా తాము నివసిస్తున్న భూమిని, రెక్కల కష్టంతో నిర్మించుకున్న గూడుని క్రమబద్దీకరించాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మంగళగిరి శాసనసభ్యుడిగా నారా లోకేశ్ పేదల పట్ల తనకు ఉన్న చిత్తశుద్ధిని కార్యాచరణలో పెట్టారు. గత పది నెలల్లో ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న ప్రజల వివరాల సేకరణ దగ్గర నుంచి వివిధ శాఖలతో సమన్వయం, పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులే ఇళ్లకు వెళ్లి దరఖాస్తులు నింపడం వరకూ అన్నీ దశలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. అత్యంత క్లిష్టమైన అటవీ భూములు, రైల్వే భూముల సమస్యను కూడా పట్టుదలగా తీసుకొని పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నారు. మొదటి దశలో 3 వేల ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారి భూమిని, వారు నిర్మించుకున్న ఇంటిని క్రమబద్దీకరిస్తూ శాశ్వత హక్కు కల్పిస్తూ ఇంటి పట్టాలు అందజేయనున్నారు. ఏప్రిల్ 3న మొదటి పట్టాను ఉండవల్లి గ్రామంలో నారా లోకేశ్ అందజేయనున్నారు. ఆయన స్వయంగా లబ్ధిదారుల నివాసానికి వెళ్లి పట్టా అందజేసి మన ఇల్లు-మన లోకేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 4 నుంచి మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ ను అనుకొని ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తున్న వేదికపై లబ్ధిదారులకు లోకేశ్ ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. ఏప్రిల్ 4న యర్రబాలెం, నీరుకొండ, కాజా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. ఏప్రిల్ 7న పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం, కొలనుకొండ, పద్మశాలి బజార్ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తారు. ఏప్రిల్ 8న రత్నాల చెరువు, మహానాడు-2కు చెందిన లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వనున్నారు. ఏప్రిల్ 11న సీతానగరం, సలాం సెంటర్, డ్రైవర్స్ కాలనీకు చెందిన లబ్ధిదారులకు, ఏప్రిల్ 12న మహానాడు-1, ఉండవల్లి సెంటర్ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు లోకేశ్ పట్టాలు అందజేయనున్నారు. మొత్తంగా మూడువేలకు పైగా పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల ముఖ్యనేతలు, నారా లోకేశ్ భారీ విజయానికి కృషి చేసిన ఆయా గ్రామాల, వార్డుల ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa