బంధువుతో ఏర్పడిన పరిచయం చివరకు ఓ యువతి ప్రాణం తీసింది. పరిచయం ప్రేమగా మారి, రహస్యంగా వివాహం చేసుకున్నాక అనుమానంతో వేధింపులు మొదలయ్యాయి. పరాయి పురుషులకు అందంగా కనిపించకూడదనే ఉద్దేశంతో తన అందమైన జుత్తును కూడా త్యాగం చేసింది. ఇంట్లో గొడవపడి మరీ గుండు చేయించుకుంది. అయినా భర్త తనతో మాట్లాడటం లేదని మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. బాధితురాలి ఫోన్ లో ఫొటోలు చూశాకే ఆమె ప్రేమ, పెళ్లి వివరాలు తమకు తెలిశాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్ళితే.... న్యూఢిల్లీకి చెందిన ప్రీతి కూశ్వాహ (18) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. రెండేళ్ల క్రితం సొంతూళ్లో జరిగిన శుభకార్యానికి హాజరైంది. ఆ వేడుకలో దూరపు బంధువు రింకూతో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచిపెట్టి ఎప్పట్లాగే ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరూ రహస్యంగా కలుసుకుంటూ, ఫోన్ లో మాట్లాడుకుంటూ రోజులు గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రీతిని రింకూ అనుమానించడం మొదలు పెట్టాడు.‘నువ్వు చాలా అందంగా ఉంటావు. ఇతరులు ఎవరైనా నిన్ను ప్రేమిస్తే నేను ఏం చేయాలి’ అంటూ వేధించాడు. దీంతో తను అందంగా కనిపించకూడదనే ఆలోచనతో ప్రీతి గుండు చేయించుకోవాలని నిర్ణయించుకుంది. దీనిపై కుటుంబ సభ్యులు వారించినా వినకుండా సెలూన్ కు వెళ్లేందుకు ప్రయత్నించడంతో.. ప్రీతి సోదరుడే ఆమెకు గుండు చేశాడు. ఆ తర్వాత కూడా రింకూ తనతో మాట్లాడకపోవడం, తను ఫోన్ చేస్తే కట్ చేయడంతో ప్రీతి డిప్రెషన్ కు గురైంది. చివరకు తన నెంబర్ కూడా బ్లాక్ చేయడంతో తనకు ఆత్మహత్యే శరణ్యమని భావించింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో తన గదిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
![]() |
![]() |