తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ బరిలోకి దిగే స్థానంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి తన తనయుడిని బరిలోకి దించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు.నారా లోకేశ్ రాజకీయ అరంగేట్రానికి తండ్రి చంద్రబాబు కష్టమైన పరీక్ష పెట్టినట్టేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ పలు నియోజకవర్గాల నుండి నుంచి లోకేశ్ పోటీ చేయొచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా కూడా భీమిలి అని ముందు రోజు, తరువాత రోజు విశాఖ ఉత్తరం నుంచి అని కూడా ప్రధాన పత్రికలలో కథనాలూ వచ్చాయి. అయితే అనూహ్యంగా, ఎవరి ఊహకు అందని విధంగా సీఎం చంద్రబాబు మంగళగిరి బరి నుంచే లోకేశ్‌ని పోటీ చేయించాలనే నిర్ణయానికి వచ్చారు.
ప్రత్యక్ష ఎన్నికల పరీక్ష పెట్టి``నారా``? పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో తానేంటో జాతీయ కార్యదర్శిగా లోకేశ్ ఇదివరకే నిరూపించుకున్నారు. కార్యకర్తల సంక్షేమానికి దేశంలో ఏ పార్టీ అమలు చేయనటువంటి పథకాలు, సహాయాలు కార్యకర్తలకు అందజేసి..తెలుగుదేశం పార్టీ నినాదాన్ని ఆచరణలో పెట్టి చూపించారు. అయితే లోకేశ్‌ని ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన సందర్బంగా ..విపక్షాల నుంచి విమర్శలొచ్చాయి. ప్రత్యక్ష ఎన్నికల నుంచి కాకుండా దొడ్డిదారిలో తనయుడిని మంత్రిని చేస్తున్నారని ఆరోపించారు. ఇవేమీ పరిగణనలోకి తీసుకోని లోకేశ్..తన తండ్రి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా, అత్యంత పారదర్శకంగా నిర్వర్తించి తానేంటో నిరూపించుకున్నారు. పార్టీపై తన ముద్ర వేశారు. మంత్రిగా తన శాఖల పరిధిలో అత్యున్నత ప్రతిభ కనబరిచారు. కానీ ప్రత్యక్ష ఎన్నికలలో కూడా తనను తాను ఎలా విజేతగా నిలుపుకుంటారో పరీక్షించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు టీడీపీకి అత్యంత ప్రతికూల నియోజకవర్గం నుంచి లోకేశ్‌ని పోటీకి దింపాలని యోచిస్తున్నారని తెలిసింది.
2014 ఎన్నికల్లోనూ హోరాహోరీ-
చుట్టూ నగర వాతావరణం కమ్ముకొస్తుండగా..పట్టణంగా అందులో ఒదిగిపోయిన మంగళగిరి చారిత్రక నేపథ్యం ఘనమైనది. మంగళగిరి చేనేత వస్త్రాలకు ప్రసిద్ధిగాంచింది. పానకాల లక్ష్మీ నృసింహుడు కొలువైన ఆధ్మాత్మిక గిరి..మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావడం ప్రతీ ఒక్కరూ ప్రతిష్టగా భావిస్తారు. కొన్నేళ్ల క్రితం వరకూ పొత్తుల్లో భాగంగా ఈ సీటును టీడీపీ మిత్రపక్షాలకు కేటాయిస్తూ వస్తోంది. 2014 ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా చేనేతల ప్రతినిధి గంజి చిరంజీవిని రంగంలోకి దింపింది. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 12 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్ధి గంజి చిరంజీవి ఓడిపోయారు. హోరాహోరీ పోరుకు వేదిక అయిన మంగళగిరి కౌంటింగ్ సందర్భంగా ఉత్కంఠతకు తెరలేపి చర్చనీయాంశమైంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ రెండు సార్లే ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి గెలిచారు. 2014లో నువ్వానేనా అన్నట్టు పోటీ సాగిన మంగళగిరి వంటి క్లిష్టమైన నియోజకవర్గం నుంచి నారా లోకేశ్ ని బరిలోకి దింపడం వెనుక సీఎంకి పెద్ద వ్యూహమే ఉంది అని విశ్లేషణలు వస్తున్నాయి.
ఒక సీటు..చాలా టార్గెట్లు-
తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచీ బీసీలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అయితే దాదాపు 66 వేల పైచిలుకు బీసీ ఓటర్లున్న మంగళగిరిలో మాత్రం తెలుగుదేశం జెండా ఎగిరింది ఇప్పటికి రెండుసార్లు మాత్రమే. బీసీలకు అండగా నిలిచిన పార్టీ జెండా ఇక్కడ ఎగరాలనేది మొదటి లక్ష్యంగా తెలుస్తోంది. రెండోది మంత్రి నారా లోకేశ్ సామాజికవర్గ ఓటర్లు ఇక్కడ అంత స్థాయిలో లేరు. నగరీకరణ చెందుతున్న ఈ నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారూ ఉన్నారు. మంగళగిరిలో గెలిస్తే..అందరి అండతో విజేతగా నిలిచిన గుర్తింపు వస్తుంది. మూడో లక్ష్యం ఏంటంటే! గేట్ వే టూ అమరావతి, ఐటీ హబ్ గా మంగళగిరిని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం కృషి చాలా ఉంది. ఐటీ శాఖా మంత్రిగా నారా లోకేశ్ చొరవతో మంగళగిరి పరిధిలో చాలా ఐటీ కంపెనీలొచ్చాయి. ఐటీహబ్‌గా మంగళగిరిని తీర్చిదిద్దడంలో లోకేశ్ కృషి ఉంది. తమ ప్రాంత అభివృద్ధికి కారకుడైన మంత్రే తమ ప్రాంత ఎమ్మెల్యే అయితే మరింత అభివృద్ధి సాధించుకోవచ్చనే స్థానికుల కోరిక లోకేశ్‌కు కలిసొచ్చే మరో అంశం. ఇవన్నీ విశ్లేషకులకు అందే ఊహాగానాలు...అయితే మరో ప్రధానమైన టార్గెట్టూ ఉందని వినవస్తోంది. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచీ నేటి వరకూ రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వైకాపా మంగళగిరి కేంద్రంగా అనేక కేసులు వేసింది. ఈ స్థానం నుంచి లోకేశ్ గెలిచి...మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఇలా చేయాలని చూపించాలనే తపనలో ఉన్నారని సమాచారం.రాజధాని ఏర్పాటు తర్వాత మంగళగిరి నియోజకవర్గం సీఆర్డీఏ పరిధిలోకి రావడం, అభివృద్ధి పనులు శరవేగంగా జరగడంతో లోకేశ్ గెలుపునకు దోహదపడే మరో అంశం.
చేనేతల ప్రతినిధి కానున్న యువనేత -
మంగళగిరి చేనేతలు ప్రసిద్ధి పొందాయి. ఇక్కడి జనాభాలో అత్యధికశాతం చేనేత వస్త్రాలు నేయడమే జీవనంగా చేసుకున్నారు. దీంతోపాటు ఆభరణాల తయారీ వృత్తిలోనూ కొందరు కొనసాగుతున్నారు. ఐటీ మంత్రిగా లోకేశ్ మంగళగిరిని ఐటీ హబ్‌గా మార్చగలిగారు. ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైతే...తన ప్రాంత చేనేతలకు యువనేతగా ఆ రంగానికి చేయూతనందించే అవకాశాలున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 2,39,536. ఇందులో 66 వేల పైచిలుకు చేనేత వర్గానికి చెందిన ఓటర్లే. ఎస్సీ ఓటర్లు 50వేల మందికి పైగా ఉన్నారు. యాదవ, పద్మశాలీ, గౌడ్, కమ్మ, కాపు, రెడ్డి సామాజిక వర్గాల ఓటర్లు తరువాతి స్థానంలో ఉన్నారు.
మంగళగిరి నియోజవర్గ చరిత్ర-
మంత్రి నారా లోకేశ్ పోటీ చేయబోతున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి ఘన చరిత్ర ఉంది. రాజకీయ చైతన్యం కలిగిన ప్రజలున్న మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ అన్ని సమీకరణాలు అనుకూలంగా ఉన్నా ఇక్కడ పాగా వేయలేకపోయింది. మంగళగిరి నియోజకవర్గం 1962లో ఏర్పడింది. 1985లో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జమునపై గెలుపొందారు. అనంతరం పొత్తులో భాగంగా ప్రతీ ఎన్నికలలోనూ ఈ సీటును మిత్రపక్షాలకూ టీడీపీ కేటాయిస్తూ వచ్చింది. మిత్రపక్షాల అభ్యర్థులూ ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో గంజి చిరంజీవి మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 12ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. తెలుగుదేశానికి, టీడీపీ మిత్రపక్షాలకు అంతగా కలిసిరాని మంగళగిరి నియోజకవర్గం నుంచి తనయుడు నారా లోకేశ్ ని ప్రత్యక్ష ఎన్నికలలో అరంగేట్రం చేయించడం ద్వారా ...తన తనయుడి సత్తా ఏంటో చాటాలనే కృతనిశ్చయంతో చంద్రబాబు ఉన్నారని మాత్రం అర్థం అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa