రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా తమ ఓటుతో వైసీపీ నేతలకు గట్టిగా బుద్ది చెప్పాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, మైలవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమా మహేశ్వరరావు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని గొల్లపూడి వన్ సెంటర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మంత్రి దేవినేనికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రమంతా చంద్రన్న పాలన కోసం ఎదురు చూస్తున్నారని.... గొల్లపూడి ప్రజలారా మీ సత్తా చాటే సమయం వచ్చేసిందంటూ మంత్రి దేవినేని పిలుపునిచ్చారు. కిక్కిరిసిన జనసందోహం నడుమ దేవినేని రోడ్ షో ముందుకు సాగింది. గొల్లపూడి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ప్రజలు దేవినేనికి ఘన స్వాగతం పలికారు. 2014లో అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు. నందిగామ సబ్ జైలులో ఖైదీగా ఉన్న వ్యక్తి ఇప్పుడు తనపై పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి పాలన కావాలో.... అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడే అనుభవం ఉన్న చంద్రబాబు పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. ఏ తప్పు చేయకపోతే జైలులో ఎందుకు ఉన్నారో ప్రతిపక్ష నేతలు ప్రజలకు వివరించాలని మంత్రి డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయం కోసం విపక్షాలు అన్నీ కలిసి చంద్రబాబుపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించామని... దీని వల్ల కృష్ణా జిల్లా రైతులు మూడు పంటలు పండిస్తున్నారని గుర్తు చేశారు. రైతుల బాగు చూడలేని వ్యక్తి... పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపి కోర్టులో కేసులు వేస్తున్నారని ఆరోపించారు. అరచేతిని అడ్డుపెట్టి అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా... రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని.... వైసీపీ నేత వైఎస్ జగన్ కు కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కదని మంత్రి దేవినేని జోస్యం చెప్పారు. పసుపు – కుంకుమ, రైతు అన్నదాత వంటి పథకాలతో ఆడపడుచులకు, రైతులకు టీడీపీ ప్రభుత్వం మేలు చేసిందన్నారు. మైలవరం నియోజకవర్గంతో పాటు గొల్లపూడిని కూడా అభివృద్ధి పధంలో ముందుకు తీసుకెళ్లి పేదల సంక్షేమం కోసం కృషి చేస్తానని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. గొల్లపూడి పంచాయతీ పరిధిలో 23 కోట్ల రూపాయల విలువైన 253 పనులు చేపట్టామని మంత్రి తెలిపారు. 1326 మంది రైతులకు రైతు రుణ మాఫీ ద్వారా 5.70 కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేశామని తెలిపారు. గొల్లపూడి పరిధిలో ఇంటింటికీ కుళాయి ఏర్పాటు కోసం 23.70 కోట్లు మంజూరయ్యాయని మంత్రి వెల్లడించారు. వెలుగు డీఆర్ డీఏ కింద 417 సంఘాలకు 2.96 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు మంజూరు చేశామన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద గొల్లపూడి పరిధిలో 86 మందికి 65.20 లక్షలు సాయం చేశామని తెలిపారు. 79 లక్షల రూపాయల విలువైన మొత్తం 50 గృహాలను గొల్లపూడిలో మంజూరు చేశామని మంత్రి దేవినేని వెల్లడించారు._
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa