తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జాతకాలు సిద్ధమయ్యాయి. ఒకటి, రెండు రోజుల్లో తొలి జాబితా వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలోని 15 నియోజకవర్గాలకు గాను తొలి విడతపది స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది. కొత్తగా ఇద్దరికి అవకాశం రానున్నట్లు తెలుస్తోంది. కొవ్వూరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కేఎస్ జవహర్, చింతలపూడి నుంచి మాజీ మంత్రి పీతల సుజాతలకు స్థానచలనంపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థుల జాతకాలను సిద్ధం చేసింది. జాబితా రూపంలో విడుదల చేయబోతుంది. మిగతా పక్షాల కంటే భిన్నంగా సమీక్షలు, ప్రజాభిప్రాయం, స్థానిక నేతల ఆలోచన సరళిని పరిగణనలోకి తీసుకుని జాబితాను రూపుదిద్దుతున్నారు. ఇటీవల నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షలు జరిగాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు స్వయంగా భేటీ అయ్యారు. వీరిలో కొందరు తమకే సీటు అంటూ బహిరంగ ప్రకటన చేశారు. మరికొందరు ఏదీ తేల్చలేదంటూ నీరసపడ్డారు. దీనిపై రకరకాల ఊహాగానాలు, ఆ తరువాత సరికొత్త సమీకరణలు. వీటన్నింటికీ కొద్ది గంటల వ్యవధిలోనే తెర దించబోతున్నారు. అధికారికంగా జాబితా విడుదలకానుంది. దీనికోసమే కేడర్ యావత్తూ ఎదురుచూస్తోంది. ఆఖరుకి వివాదాస్పదమైన నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్‌లకే మరోమారు అవకాశం కల్పించనున్నారు. పది స్థానాలకు పైగానే జాబితాలో చోటు ఉంటుందని చెబుతున్నా.. ఇది 12కు చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఒకరిద్దరి కొత్త ముఖాలకు అవకాశం ఇస్తారంటూ ఇప్పటికీ ప్రచారం జరుగుతోంది.
టీడీపీ ఎత్తుగడ ఇది
మునుపెన్నడూ లేని విధంగా టీడీపీ అభ్యర్థుల ఖరారులో సరికొత్త పంధాను అవలంభిస్తుంది. అత్యధికంగా సిట్టింగ్‌లకే అవకాశం ఇవ్వబోతున్నది. కొత్త ముఖాలు వస్తాయంటూ జరిగిన ప్రచారానికి తెరదింపనున్నారు. వాస్తవానికి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 14 స్థానాల్లో తెలుగుదేశం విజయపతాకం ఎగురవేసింది. ఈసారి కూడా అదే తీరును కొనసాగించేందుకు, ప్రజామోదం పొందేందుకు సిట్టింగ్‌ల్లో అత్యధికులకు మరోమారు అవకాశం కల్పించబోతున్నారు. ఇప్పటికే ఖరారైనట్టుగా చెబుతున్న అనేక స్థానాలు తొలి జాబితాలో చోటు చేసుకోవచ్చు. ఈ విషయంలో మరో సందేహానికి తావులేకుండా స్పష్టత ఇచ్చే ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. డెల్టాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సిట్టింగ్‌లకే అవకాశం ఇచ్చేలా, సమీక్ష సందర్భంగానే ఒకింత భరోసా లభించింది. నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో ఒక్క తాడేపల్లిగూడెం మినహా మిగతా అన్నిచోట్ల సిట్టింగ్‌లకే టికెట్లు ఇవ్వాలని సంకల్పించారు. ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండానే జాబితాలో చేర్చి సమరానికి సన్నద్ధం చేస్తున్నారు. ఆచంట నుంచి మంత్రి పితాని సత్యనారాయణ, నరసాపురం నుంచి మాధవనాయుడు, పాలకొల్లు నుంచి రామానాయుడు, భీమవరం నుంచి అంజిబాబు, ఉండి నుంచి శివరామరాజు, తణుకు నుంచి ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్లు ఇప్పటికే ఖరారు కాగా, నేరుగా ప్రకటించనున్న జాబితాలో చోటు కల్పిస్తారు. తాడేపల్లిగూడెంలో ఈలి నానికే టికెట్ ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఈ విషయంలో కొంత వివాదం నెలకొన్నా వాటన్నింటినీ అధిష్టానం తేలిగ్గా తీసుకుంది. నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడు తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నా సీఎం చంద్రబాబు ఆయనకు ఎలాంటి హామీ ఇస్తారనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.
ఏలూరు లోక్‌సభలో కుదుటపడని వ్యవహారం-
ఏలూరు లోక్‌సభ పరిధిలోవున్న అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధుల కూర్పు ఇంకా కుదుట పడలేదు. ఇంకా వివాదాలు కొలిక్కి రాలేదు. చింతలపూడిలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడం, దీనికి తగ్గట్టుగానే పార్టీకి ఒకింత బలం పెంచేలా మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ చేరికతో సమీకరణలు కాస్త మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే పీతల సుజాతకు మరో నియోజకవర్గానికి మారుస్తున్నారంటూ తాజాగా ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే పార్టీ సీనియర్లు సైతం ఈ తరహా ప్రచారంలోనే ఉన్నారు. డాక్టర్ రాజారావు పేరు ప్రస్తావనకు వస్తున్నాఎంత వరకు ఖరారు చేస్తారనేది తేలాల్సి ఉంది. ఆయనతోపాటు వెంకన్న, రోషన్‌కుమార్, గుడిపూడి రవి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. వీరంతా మంగళవారం సీఎం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. దెందులూరు నియోజకవర్గం నుంచి ప్రభుత్వ విప్ ప్రభాకర్‌కే మరోమారు టికెట్ ప్రకటించనున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు నియోజకవర్గ సమీక్ష చేసిన తరువాత ప్రభాకర్ విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. వీటిని పటాపంచలు చేస్తూ జాబితాలో ప్రభాకర్ పేరు ఖాయంగా వినిపిస్తోంది. రెండు, మూడు నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే పట్టున్న ప్రభాకర్ విషయంలో ఇప్పటి వరకు జరిగిన వివాదాలను పక్కనపెట్టి ఛాన్స్ ఇవ్వబోతున్నారు. ఆయన వ్యతిరేక వర్గీయులకు ఇదొక షాక్‌గా మారనుంది. ఏలూరు నియోజకవర్గంలో అనూహ్యంగా మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. పార్టీలో ఎవరూ ఊహించని విధంగా ఎస్‌ఎంఆర్ పెదబాబు టీడీపీ నుంచి నిష్క్రమించారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి విజయావకాశాలు మెరుగ్గా ఉండగా, చోటు చేసుకున్న ఈ పరిణామాలు విస్మయం కలిగిస్తున్నాయి. ఉంగుటూరు నియోజకవర్గంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులకే మరోసారి ఛాన్స్‌కు పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఆయనకు బదులుగా జడ్పీ చైర్మన్ బాపిరాజును బరిలోకి దింపేందుకు వీలుగా ఇటీవల సర్వే చేశారు. పోలవరం నియోజకవర్గంలోనూ ఇంకా సస్పెన్స్ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముడియంను మార్చి కొత్త ముఖానికి ఛాన్స్ ఇస్తారని చెబుతున్నారు.
రాజమహేంద్రవరం పరిధిలో ఇంకో తీరు-
రాజమహేంద్రవరం లోక్‌సభ పరిధిలోని నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరు అసెంబ్లీ స్థానాలు మూడింటిలోనూ వివాదం చోటు చేసుకుంది. రాజకీయంగా ప్రతిష్టగా భావించడంతో వర్గాల వారీగా విడిపోయారు. కొవ్వూరు నుంచి మంత్రి జవహర్‌ను తప్పించి గోపాలపురం లేదా చింతలపూడికి మార్చవచ్చునంటూ భారీ ప్రచారం సాగింది. తెలుగుదేశం నేత అచ్చిబాబు నిర్ణయం బట్టి కొవ్వూరు అభ్యర్థిత్వం ఆధారపడి ఉంది. నిడదవోలు నియోజకవర్గంలో అన్నదమ్ముల సవాల్ ఆసక్తిగా మారింది. మంగళవారం ఈ వ్యవహారంతో రాజధానిలోనే బూరుగుపల్లి గోపాలకృష్ణ, కుందుల సత్యనారాయణ మకాం వేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముప్పిడికి అవకాశం ఇస్తారా, లేదా యువనేత మద్దిపాటికి ఛాన్స్ ఇస్తారనేది తేలిపోనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa