పదేళ్ల వయసులో పిల్లలు ఏం చేస్తారు? మహా అయితే చదువుకుంటారు..ఆడుకుంటారు..అల్లరి చేస్తారు. కాని ఓ కుర్రాడు వీటన్నిటికీ భిన్నమైన పని చేశాడు. పదేళ్ల వయసులోనే విమాన సేవలందించే సంస్థను ప్రారంభించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అటువైపు దృష్టి సారించి చాలా తెలుసుకున్నాడు. అయినా కొన్ని అంశాల గురించి స్పష్టత లేదు. ఏమి చేయాలా అని ఆలోచించాడు. ఎలాగైనా తెలుసుకోవాలని ఏకంగా ఓ భారీ ఎయిర్‌లైన్స్ సీఈవోకు లేఖ రాశాడు. తన ప్రశ్నలకు ఏవైనా సమాధానాలు, సలహాలు ఉంటే తప్పకుండా తెలియజేయాలని కోరాడు.
ఆస్ట్రేలియాకు చెందిన ఈ కుర్రాడి పేరు అలెక్స్ జాక్వట్. పది సంవత్సరాల వయసులోనే సొంతంగా ఎయిర్‌లైన్స్ సంస్థ స్థాపించాలనే కుతూహలం కలిగింది. ఒక అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కి సీఈవోగా ఉండాలని అనుకున్నాడు. నెట్‌లో్ చాలా సమాచారం సంపాదించాడు. అయినా కొన్నింటికి సమాధానాలు తెలియరాలేదు. వాటిని తెలుసుకోవడం కోసం ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌గా పేరుగాంచిన 'క్వాంటాస్' సీఈవో అలెన్ జోస్‌కు ఆ ప్రశ్నలన్నిటినీ పెన్సిల్‌తో ఒక కాగితంపై రాసి పంపించాడు. నేను చెబుతున్నవన్నీ సీరియస్‌గా తీసుకోవాలని లేఖ మొదట్లోనే రాశాడు.'ఇప్పుడు నాకు పాఠశాల సెలవులు. నా దగ్గర చాలా సమయం ఉంది. అందుకే ఓషనియా ఎక్స్‌ప్రెస్ పేరుతో అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ నడపాలనుకుంటున్నాను(నేను చెప్పేవన్నీ సీరియస్‌గా తీసుకోండి). దాన్ని ఎలా ప్రారంభించాలి? దానికి నేనే సీఈవో. నా మిత్రుడు వైస్ సీఈవోగా ఉంటాడు. ముందుగా సిడ్నీ నుంచి లండన్‌కు నాన్‌స్టాప్ సర్వీస్‌లు నడపాలనుకుంటున్నాను. అయితే విమానం దాదాపు 25 గంటలు ఆగకుండా ప్రయాణం చేయాలి. నా విమానాల్లో ప్రయాణిస్తున్నవారెవ్వరూ ఇబ్బంది పడకూడదు. వారు నిద్రపోయేందుకు వీలుగా విమానంలో ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ సాధ్యం కావడానికి మీ దగ్గర ఏవైనా సలహాలున్నాయా? ఉంటే చెప్పండి' అని లేఖలో క్వాంటాస్ సీఈవోను కోరాడు.
ఈ బుడతడి లేఖకు క్వాంటాస్ సీఈవో స్పందించారు. 'నీకు వ్యాపారం ఎలా ప్రారంభించాలో చెప్పడానికి నేను సరైన వ్యక్తిని కాదు. నీ సంస్థలో నువ్వు నియమించిన న్యాయ సలహాదారు చెప్తాడు. ఇక విమానంలో ప్రయాణికులు నిద్రించడానికి సరైన ఏర్పాట్ల గురించే మేము కూడా ఎప్పటినుంచో ఆలోచిస్తున్నాము. కాని ఇప్పటి వరకూ పరిష్కారాలు దొరకలేదు. వీటికి పరిష్కారం దొరకాలంటే మనం ఒకసారి కలవాలి. ఏదేమైనా నీ ఆలోచన మంచిది. నేను కూడా నీ వయసులో అలాగే ఆలోచించేవాణ్ని' అంటూ లేఖ రాశారు. అనంతరం ఆ కుర్రాడి ఫొటోను, పెన్సిల్‌తో రాసిన లేఖను, సీఈవో రాసిన లేఖను క్వాంటాస్ ట్విటర్ ఖాతాలో ఉంచింది. అంత పెద్ద సంస్థకు సీఈవో అయినా ఒక పదేళ్ల కుర్రాడి ఆలోచనలకు, రాసిన లేఖకు విలువిచ్చి వాటికి సమాధానం ఇవ్వడం చూసిన నెటిజన్లు ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa