ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు తలెత్తాయి. 'హ్యాండ్స్ ఆఫ్!' పేరుతో నిర్వహించిన ఈ ధర్నాలో వేలాది మంది పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీ, బోస్టన్, లాస్ ఏంజిలిస్ వంటి ప్రధాన నగరాలతో పాటు చిన్న పట్టణాల్లో కూడా ఈ ఆందోళనలు జరిగాయి. ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక విధానాలు, కొత్తగా విధించిన సుంకాలు, సామాజిక సేవలలో కోతలు, ప్రభుత్వ సంస్థల మూసివేతలను వారు తీవ్రంగా వ్యతిరేకించారు.ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికన్లలో అసంతృప్తిని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా, కెనడా, మెక్సికో వంటి దేశాల నుంచి దిగుమతులపై 25% సుంకాలు విధించడం, అమెరికాలో ఉన్న వలసదారులను భారీగా బహిష్కరించే ప్రణాళికలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఈ సుంకాల వల్ల వస్తువుల ధరలు పెరిగి, ద్రవ్యోల్బణం (ఇన్‌ఫ్లేషన్) పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో, ఎలాన్ మస్క్ నేతృత్వంలోని "డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE), ఫెడరల్ ఉద్యోగాలను తగ్గించడం, ప్రభుత్వ సేవలను కుదించడం వంటి చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలను "ప్రజాస్వామ్యానికి ముప్పు" అని విమర్శకులు చెబుతున్నారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, ఆలస్కా వంటి ప్రాంతాల్లో నిరసనకారులు "ట్రంప్ అండ్ మస్క్ హ్యాండ్స్ ఆఫ్" అనే నినాదాలతో ప్రదర్శనలు చేస్తున్నారు.
![]() |
![]() |