ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ వైసీపీలో అసమ్మతి సెగలు - అధిష్ఠానానికి స‌రికొత్త‌ తలనొప్పులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 05:21 PM

 విశాఖపట్నం :  మరో నాలుగు రోజుల్లో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఏళ్ల తరబడి పార్టీ జెండాలు మోసిన త‌మ‌ని ప‌క్క‌న పెట్టి  ఇటీవల పార్టీలో చేరిన నేతలకు టిక్కెట్లు కట్టబెట్టేందుకు అధిష్ఠానం మొగ్గుచూపుతోందంటూ విశాఖ జిల్లాల‌లోని వివిధ నియోజ‌క‌వ‌ర్గాల పార్టీ సమన్వయకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏళ్ల తరబడి పార్టీ జెండాలు మోసి, పార్టీ కార్యక్రమాలను నిర్వహించిన తమను కాదని కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తికి టిక్కెట్‌ ఎలా ఇస్తారంటూ తిరుగుబావుటా ఎగురవేశారు. తమలో ఒకరికి టిక్కెట్‌ ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు సహకరించేది లేదంటూ ఇప్పటికే అల్టిమేటం ఇచ్చారు. 
ఎలమంచిలి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ప్రగడ నాగేశ్వరరావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత పార్టీ సమన్వయకర్తగా కొంతకాలం పనిచేశారు. ఆ తరువాత ఆయన్ను తొలగించి బొడ్డేడ ప్రసాద్‌ను నియమించారు. ఇటీవల బొడ్డేడ ప్రసాద్‌ను తొలగించి టీడీపీ నుంచి చేరిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజుకు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు.  
 ఇక భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న‌ అక్కరమాని విజయనిర్మలకు  టిక్కెట్‌ ఖాయమని అధిష్ఠానం హామీ ఇవ్వడంతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కొన్నేళ్లుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చారు.  ఈ తరుణంలో కొద్దిరోజుల కిందట టీడీపీ నుంచి చేరిన ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు భీమిలి టిక్కెట్‌ కేటాయించడంతో విజయనిర్మల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  తాజా పరిణామంతో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీకి దిగాలని భావిస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్ బ‌దులు అక్కరమాని విజయనిర్మల లేదా మరో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి ’ టిక్కెట్‌ ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయానికి వచ్చినట్టు పార్టీలో ప్రచారం జరగడంతో వంశీకృష్ణశ్రీనివాస్‌ అనుచరులు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. వంశీకృష్ణకు టిక్కెట్‌ ఇవ్వకపోతే యాదవుల సత్తా ఏమిటో చూపిస్తామంటూ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గం సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణకు చెందిన ఎంవీపీ కాలనీలోని కార్యాలయానికి వెళ్లి హెచ్చరించారు.ఇదిలావుండగా దక్షిణ నియోజకవర్గం నుంచి తమకే టిక్కెట్‌ ఇవ్వాలంటూ కోలా గురువులు అనుచరులు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. గురువులు టిక్కెట్‌ కోసం హైదరాబాద్‌లో మకాం వేసి తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఒకవేళ గురువులుకు టిక్కెట్‌ ఇస్తే...ప్రస్తుత సమన్వయకర్త డాక్టర్‌ పీవీ రమణమూర్తి వర్గం నుంచి అసమ్మతి ఎదురుకావడం ఖాయం.
మరో నాలుగు రోజుల్లో నామినేషన్ల పర్వం ప్రారంభం అయిపోతోంది. . ప్రత్యర్థి పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయడంతోపాటు ప్రచారం కూడా ప్రారంభించేసిన‌ పరిస్థితిలో అప్పటికప్పుడు అభ్యర్థులను ప్రకటించడం వల్ల ప్రచారానికి తగిన సమయం ఉండకపోవడంతోపాటు అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు కూడా అవకాశం వుండదని నేతలు ఆందోళన చెందుతున్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa