టిటిడికి చెందిన తిరుపతిలోని విష్ణునివాసం వసతి సముదాయానికి ఐఎస్‌వో (ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్) ధ్రువీకరణ లభించింది. ఈ మేరకు ఐఎస్‌వో సంస్థ ప్రతినిధులు గురువారం టిటిడి పరిపాలనా భవనంలో ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం సమక్షంలో ధ్రువపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎస్‌వో డైరెక్టర్ శ్రీ కార్తికేయన్ మాట్లాడుతూ విష్ణునివాసం వసతి సముదాయానికి భక్తులు విశేషసంఖ్యలో విచ్చేస్తున్నారని, ఈ భవనం నిర్వహణకు సంబంధించి టిటిడి మెరుగైన నాణ్యత ప్రమాణాలు పాటిస్తోందని అభినందించారు.
అనంతరం సమావేశ మందిరంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ 1947, ఫిబ్రవరి 23న ఐఎస్‌వో ఏర్పాటైందని, 160 దేశాలు సభ్యత్వాన్ని పొందాయని, ఇప్పటివరకు 20 వేల స్టాండర్డ్స్‌ను గుర్తించారని వివరించారు. టిటిడిలో మొట్టమొదటిసారిగా విష్ణునివాసానికి ఐఎస్‌వో ధ్రువీకరణ లభించిందన్నారు. ఇదే స్ఫూర్తితో టిటిడి ఆసుపత్రులు, విద్యాసంస్థలు మెరుగైన సేవలు అందించి ఐఎస్‌వో ధ్రువీకరణ కోసం కృషి చేయాలని కోరారు. ఐఎస్‌వో ప్రతినిధులు 20 రోజుల్లో మూడుసార్లు విష్ణునివాసాన్ని పరిశీలించారని తెలిపారు. మొదటిసారి పరిశీలనలో పలు సూచనలు ఇచ్చారని, రెండోసారి ఒక అంచనాకు వచ్చారని, మూడోసారి పరిశీలనలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం ద్వారా నాణ్యతా ప్రమాణాలను ప్రత్యక్షంగా పరిశీలించారని తెలియజేశారు. ఇలాంటి గుర్తింపు కోసం కృషి చేసిన అన్ని విభాగాల అధికారులకు ఈ సందర్భంగా జెఈవో అభినందించారు. విష్ణునివాసంలో సిబ్బంది అందరూ డ్రెస్‌కోడ్, గుర్తింపు కార్డు ధరించేలా చర్యలు చేపట్టామని, భక్తులకు నిస్వార్థంగా సేవలందించేలా సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించామన్నారు. అదేవిధంగా, అన్నప్రసాదాలు నాణ్యంగా తయారుచేసి భక్తులకు అందించామని, రక్షిత తాగునీటి వసతి కల్పించామని, గదులు, లాకర్లు సులభంగా లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేశామని, భక్తులకు అర్థమయ్యేలా సూచికబోర్డులు ఏర్పాటుచేశామని వివరించారు. గదుల్లో విద్యుత్, నీటి సరఫరా, మరుగుదొడ్లు చక్కగా ఉండేలా చేశామని, అక్కడక్కడా టివిలు ఏర్పాటుచేసి ఎస్వీబీసీ ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మికత పెంపొందించే కార్యక్రమాలు ప్రసారం చేశామని తెలియజేశారు. భద్రతాపరంగా సమస్యలు ఎదురైనపుడు వెంటనే స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకుకోనేందుకు వీలుగా మాక్‌డ్రిల్ నిర్వహణకు చర్యలు చేపట్టామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa