రాష్ట్రంలో ప్రభుత్వ అండతో కూటమి పార్టీలు తమ అవినీతి సంపాధన కోసం పరిశ్రమలపై వేధింపులకు పాల్పడుతున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, తైనాల విజయ్‌కుమార్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు. కూటమి పార్టీ నేతల అరాచకాలతో రాష్ట్రంలోని పరిశ్రమల మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఈ సందర్బంగా బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే జిందాల్ వంటి పారిశ్రామిక దిగ్గజాలన వేధించి రాష్ట్రం నుంచి సాగనంపారని, ఇప్పుడు కడప జిల్లాలోని సిమెంట్ పరిశ్రమలను మూయించే కార్యక్రమం చేస్తున్నారని ధ్వజమెత్తారు.అయన మాట్లాడుతూ.... సీఎం చంద్రబాబు ఎక్కడ మాట్లాడిన రాష్ట్రంలో శాంతిభద్రతలు చక్కగా ఉన్నాయి, పరిశ్రమలు పెద్ద ఎత్తున పెట్టబడులు పెట్టేందుకు వస్తున్నాయని, వేల కోట్లుతో కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాస్తవం చూస్తే ఉన్న పరిశ్రమలనే మామూళ్ళ కోసం, కాంట్రాక్ట్‌ల కోసం బెదిరించి, రౌడీయిజంతో భయబ్రాంతులకు గురి చేసి పారిపోయేలా కూటమి పార్టీల నాయకులు చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో ముడుపుల కోసం పరిశ్రమలను మూయించారు. తాజాగా కడప జిల్లాలో సిమెంట్ పరిశ్రమపై జరిపిన దౌర్జన్యం అందరూ చూశారు. మూడు నాలుగు నెలల కిందట విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న కర్మాగారం వద్ద ఫ్లైయాష్ కోసం చేసిన గొడవ అందరికీ తెలుసు. కృష్ణపట్నంలో పవర్ ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్‌పై ఎలాంటి దౌర్జన్యం చేశారో తెలుసు. ఎచ్చెర్లలో ఉన్న మద్యం ఫ్యాక్టరీని ప్రతి లోడ్ లారీకి మామూళ్ళు ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులు ఏ విధంగా దౌర్జన్యం చేశారో చూశాం. ప్రతి జిల్లాలో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. జిందాల్ యాజమాన్యం ఈ దేశంలోనే ప్రముఖ పరిశ్రమల సరసన గుర్తింపు పొందిన సంస్థ. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వారిపై జరిపిన వేధింపులతో వారు మహారాష్ట్రకు వెళ్ళిపోయి అక్కడ మూడు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఎక్కడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. పరిశ్రమలను వేధిస్తున్న వారిపై ఎక్కడా చట్టపరమైన చర్యలు లేవు. ముఖ్యమంత్రి మాత్రం పరిశ్రమలకు అనుకూలమైన ప్రభుత్వం మాది అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు ఫ్ల్రెండ్లీ వాతావరణంను ఎలా సృష్టిస్తారు. అధికారంను అడ్డం పెట్టుకుని అందరిపైనా జులుం ప్రదర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను అందరూ గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వ అలసత్వం, దుర్మార్గమైన ఆలోచనల వల్ల రాబోయే తరాలు చాలా ఇబ్బంది పడతాయి అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa