వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ్ బెంగాల్‌లో చేపట్టిన ఆందోళనలు హింసకు దారితీసి.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లను ఉద్దేశించి బంగ్లాదేశ్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ (MEA) తీవ్రంగా స్పందించింది. ముర్షిదాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన సామూహిక అల్లర్లపై బంగ్లాదేశ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. బదులుగా, తన దేశంలోని మైనారిటీలపై జరుగుతున్న దాడులు, ఆకృత్యాలను పరిష్కరించాలని బంగ్లాదేశ్‌కు కౌంటర్ ఇచ్చింది. గతేడాది జులై నుంచి బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు జరుగుతోన్న విషయం తెలిసిందే.
‘‘పశ్చిమ బెంగాల్ ఘటనలపై బంగ్లాదేశ్ చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం... బంగ్లాదేశ్ చేసి ఈ వ్యాఖ్యలు స్నేహం ముసుగులో భారత్‌పై విమర్శ చేసే ప్రయత్నంగా.. అలాగే తమ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న అన్యాయాలను దాచే ప్రయత్నంగా భావిస్తున్నాం.. అంతేకాదు సంబంధం లేని వ్యాఖ్యలు చేయడం, నైతికత పరంగా గొప్పగా ప్రవర్తిస్తున్నట్టు చూపించడంకంటే, బంగ్లాదేశ్ తన దేశంలోని మైనారిటీల హక్కులను రక్షించడంపై దృష్టి సారిస్తే మంచిది’ అని ఈ మేరకు విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ హితవు పలికారు.
బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ప్రెస్ సెక్రటరీ షఫికుల్ అలాం ఇటీవల మాట్లాడుతూ.. భారత్‌లోని ముస్లిం మైనారిటీలకు పూర్తి భద్రత కల్పించాలని, ముర్షిదాబాద్ అల్లర్లsy బంగ్లాదేశ్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. *ముర్షిదాబాద్ అల్లర్లకు బంగ్లాదేశ్‌కు సంబంధం అంటగట్టే ఏ ప్రయత్నాలనైనా మేము గట్టిగా ఖండిస్తున్నాం’ అని చెప్పారు.
బెంగాల్‌లో ‘వక్ఫ్’ మంటలు.. హింసాత్మకంగా మారిన ఆందోళనలు
ఏప్రిల్ 11న వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, అనేకమంది గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టమూ జరిగింది. పలు కుటుంబాలు ప్రాణభయంతో అక్కడ నుంచి పారిపోయి జార్ఖండ్‌లోని పాకుర్ జిల్లాలో కొందరు... బెంగాల్‌లోని మాల్డా జిల్లాలోని శరణార్థుల శిబిరాలకు తరలివెళ్లారు.
కోల్‌కతా హైకోర్టు ముర్షిదాబాద్‌లో శాంతి భద్రతల నిర్వహణ కోసం కేంద్ర బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించాలని ఆదేశించింది. బాధితుల పునరావాసంపై కోర్టు నేరుగా పర్యవేక్షణ చేయనుంది. అంతేగాక, బీజేపీ, టీఎంసీ వంటి రాజకీయ పార్టీల నేతలు ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయరాదని హెచ్చరించింది. కాగా, మమతా బెనర్జీ.. వివాదాస్పద వక్ఫ్ (సవరణ) చట్టాన్ని తన రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రకటించారు. అంతేకాదు, ఈ చట్టాన్ని కేంద్రం చేసిందని, దీనిపై వారినే సమాధానం అడగండి అని ఆందోళనకారులకు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హింసను ఉపేక్షించబోమని, అల్లర్లను రెచ్చగొట్టేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఉద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa