ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐదేళ్ల తర్వాత మానసరోవర యాత్ర.. భారత్, చైనా సంబంధాల్లో కీలక మలుపు

national |  Suryaa Desk  | Published : Fri, Apr 18, 2025, 08:36 PM

భారత్, చైనా మధ్య సంబంధాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సరిహద్దుల్లో ప్రతిష్టంభనతో 2919 తర్వాత ఆగిపోయిన కైలాస మానసరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించడానికి ఇరు దేశాలూ అంగీకరించాయి. ఇటీవల కాలంలో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. హిమాలయాల్లోని కైలాస యాత్రను కరోనా వైరస్ అనంతరం ఈ ఏడాది పునరుద్ధరించనున్నారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం ప్రకటించారు. 2020లో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తితో పాటు గల్వాన్ లోయ ఘర్షణల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో ఈ యాత్ర నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో యాత్ర పునరుద్దరణతొ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది.


కైలాస మానసరోవర్ యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తారు. ఈ యాత్ర పునఃప్రారంభం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. దీని ద్వారా భక్తులకు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కైలాస మానసరోవర్ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రపై చాలా మంది ఆసక్తి చూపుతారు. హిమాలయాలల్లో ఆధ్యాత్మిక అనుభూతి పొందాలని భక్తులు కోరుకుంటారు. రెండు మార్గాల ద్వారా యాత్రను నిర్వహిస్తారు. మొదటిది ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ కనుమ మార్గం. ఇది 1981 నుంచి ఉంది. రెండోది సిక్కింలోని నాథులా కనుమ మార్గం. ఇది 2015లో ప్రారంభమైంది. ఈ రెండు మార్గాలు భక్తులకు దైవ అనుభూతిని కలిగించి.. ప్రకృతితో మమేకమయ్యే అవకాశాన్ని ఇస్తాయి.


భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ గతేడాది డిసెంబరులో భేటీ అయి... సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం కాపాడాలని వారు నిర్ణయించారు. ‘‘సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు’ అని అధికారులు అన్నారు. నాథులా కనుమ ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని పునరుద్ధరించడానికి రెండు దేశాలు అంగీకరించాయి. సరిహద్దు ప్రాంతాల్లోని నదులపై సమాచార మార్పిడికి కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ఒప్పందాలు భారత్, చైనా మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి సహాయపడతాయి.


భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయడానికి కైలాస మానసరోవర్ యాత్ర పునః ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరుస్తుందని, అంతేకాకుండా, భక్తులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుందని అంటున్నారు.


మానసరోవర్ యాత్రకు భక్తులను ఎంపిక చేసే గడువు కొన్ని వారాల్లో ముగియనుండటంతో ఈ యాత్రను 2019 తర్వాత మళ్లీ ప్రారంభించేందుకు భారత్, చైనా అధికారులు ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గత కొన్ని వారాలలో ఈ యాత్రను పునఃప్రారంభించడంపై రెండు దేశాల మధ్య లోతైన చర్చలు జరిగాయి.. త్వరలోనే పురోగతి వచ్చే అవకాశం ఉందని అంచనా. అధికారుల ప్రకారం.. ఇరుదేశాల మధ్య మిగిలిన సమస్యలపై విబేధాలను తగ్గించేందుకు ముఖ్యంగా సరిహద్దు మౌలికవసతుల పరిశీలన, ప్రయాణాన్ని సజావుగా కొనసాగించేందుకు లాజిస్టిక్స్ పునరుద్ధరణపై చర్చలు సాగుతున్నాయి,


విశ్వసనీయ వర్గాల ప్రకారం.. విదేశాంగ శాఖ ఏప్రిల్ 21న ఈ యాత్రపై సంబంధిత ఏజెన్సీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కుమాయున్ మండల్ వికాస్ నిగంలోని ఒక అధికారి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.యాత్రకు అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయని, అవి సమయానికి పూర్తవుతాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది భక్తులను ధారచులా నుంచి లిపులేఖ్ పాస్ వరకు ప్రత్యేక రవాణా ద్వారా తీసుకెళ్లే ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆ అధికారి చెప్పారు. దీని వల్ల యాత్రికులు 80-100 కిలోమీటర్ల నడిచే ఇబ్బంది తప్పుతుంది. ఈ ప్రయాణానికి సాధారణంగా రెండు మూడు రోజులు పడుతుంది. ఈ ఏడాది యాత్ర ఖర్చు కూడా గత ఆరేళ్లతో పోలిస్తే గణనీయంగా పెరగనుందని అధికారులు తెలిపారు. ఎందుకంటే నివాసం, రవాణా ఛార్జీలు భారత్, చైనా ఇరువైపులా పెరిగాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa