టీనేజ్, యుక్త వయసు, కౌమార దశ.. పేరేదైనా సరే.. ఆ వయసులో పిల్లలను కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న వారి భవిష్యత్తు అంధకారమే అవుతుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ యువకుడి కథ. చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు ఈ యువకుడు. పదో తరగతి 10/10 ఇంటర్‌లో 965 మార్కులు సాధించాడు. డిగ్రీ ఫస్టియర్, సెకండియర్‌లో 90 శాతం మార్కులు సాధించాడు. అదే కొనసాగితే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేవాడు. కానీ ఆలోచనలు అదుపు తప్పడంతో.. వ్యసనాల బారినపడ్డాడు. ఆపై అనైతిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఫలితం చివరకు హంతకుడిగా మారాడు. మరి ఆ యువకుడి జీవితం ఎందుకు ఇలా దిగజారిందంటే..
వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో అవాల భవానీ అనే వివాహిత దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణలో కొండక వీర్రాజు ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడయ్యింది. పోలీసుల అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇక దర్యాప్తులో పోలీసులకు ఆసక్తికర విషయాలు తెలిశాయి. హంతకుడిగా మారిన వీర్రాజు.. చదువులో టాపర్ అని.. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు మంచి మార్కులు సాధించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే సరైన పర్యవేక్షణ లేక వ్యసనాలకు అలవాటు పడి.. వివాహేతర బంధంలోకి ప్రవేశించి చివరకు హంతకుడిగా మారినట్లు తెలుసుకున్నారు.
వివాహేతర బంధం ఆపై హత్య..
వీర్రాజు ఏప్రిల్ 19న అవాల భవానీ అనే వివాహితను గొంతు కోసి హత్య చేశాడు. వీరిద్దరి మధ్య ఉన్న వివాహేతర బంధమే ఈ దారుణానికి కారణం అయ్యింది. ఇద్దరికి పైడి భీమవరంలోని ఓ హొటల్‌లో నాలుగు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం హోటల్ యజమానికి తెలియడంతో వీర్రాజును పనిలో నుంచి తీసేశాడు. ఆ తర్వాత భవానీ తమ విషయం ఇంటిలో తెలిసిపోతుందని వీర్రాజును దూరం పెట్టింది. ఫోన్ చేసినా మాట్లాడకపోవడంతో వీర్రాజు ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. భవానికి మరొకరితో అక్రమ సంబంధం ఉండడం వల్లనే తనను దూరం పెడుతోందని భావించి.. ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
దానిలో భాగంగా ఈ నెల 19న పైడిభీమవరంలోని ఒక దుకాణంలో చాకు కొనుక్కుని తన దగ్గర ఉంచుకున్నాడు. పైడిభీమవరం నడిబొడ్డున ఉన్న గుర్రమ్మ గుడి వెనుక ఉన్న కాజావారి కోనేరుగట్టు వద్ద అవాల భవాని రావడం గమనించి ఆమె దగ్గరకి వెళ్లి మాట్లాడాలని ప్రయత్నించాడు. అయితే భవాని అందుకు నిరాకరించింది. దీంతో తనతో తెచ్చుకున్న చాకుతో భవాని గొంతును రెండు సార్లు కోసి హత్య చేశాడు.
తర్వాత అక్కడ నుంచి పారిపోయిన వీర్రాజు విజయవాడలోని ఇంటికి చేరుకుని ఎవరూ గుర్తు పట్టకుండా గుండు గీసుకుని తిరుపతి వెళ్లిపోయాడు. తిరిగి వచ్చే సమయంలో పోలీసులకు వీర్రాజు గురించి వచ్చిన కచ్చితమైన సమాచారం అందడంతో.. రణస్థలం మండలంలోని కమ్మసిగడాం వద్ద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
డిగ్రీ చివరి ఏడాదిలో బెట్టింగ్‌కు అలవాటు పడి..
డిగ్రీ రెండు సంవత్సరాలు మంచి మార్కులతో పాస్ అయిన వీర్రాజు.. చివరి ఏడాదిలో బెట్టింగులకు అలవాటు పడి డబ్బులు అప్పు చేసి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. వీర్రాజు వ్యక్తిగత విషయాలకు వస్తే.. అతడి స్వస్థలం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండటంలోని నడిపల్లి గ్రామం. అయితే వీర్రాజు చిన్నతనంలోనే అతడి కుటుంబం విజయవాడకు వలసవెళ్లింది. ఇక వీర్రాజు విజయవాడలోనే చదువుకున్నాడు. అయితే డిగ్రీ చివరి సంవత్సరంలో అతడు చెడు అలవాట్లకు బానిసగా మారడంతో.. అన్నదమ్ములు వీర్రాజును నడిపల్లి గ్రామానికి పంపించారు. ఊరికి వచ్చిన తర్వాత వీర్రాజు పైడిభీమవరంలోని ఒక హోటల్‌లో సర్వర్‌గా పనిలో జాయినయ్యాడు. అక్కడే అతడికి భవానితో పరిచయం, ఆపై వివాహేతర బంధం.. చివరకు హత్య వరకు వెళ్లాడు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపిస్తే.. పిల్లల జీవితాలు ఎలా నాశనం అవుతాయో వీర్రాజు జీవితమే ఉదాహరణ అంటున్నారు పోలీసులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa