ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే టీడీపీలో చేరనున్న హర్షకుమార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 16, 2019, 09:45 PM

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపికలోను, జాబితాల ప్రకటనలోను పార్టీలన్నీ తలమునకలై వున్నాయి. మరోపక్క, అదే సమయంలో వలసలు ఊపందు కున్నాయి. ఈ క్రమంలో నేడు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశ మయ్యారు. విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబును కలిసిన హర్షకుమార్ టీడీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.
అమలాపురం ప్రజలకు ఆత్మీయుడిగా పేరుగాంచిన హర్షకుమార్‌ టీడీపీలోకి వస్తే అక్కడ గెలుపు నల్లేరుపై నడకే అని భావించిన టీడీపీ అధిష్టానం ఆయన చేరికకు లైన్‌ క్లియర్‌ చేస్తూ స్థానిక మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్పలను రంగంలోకి దింపింది. దీనితో వారు హర్షకుమార్‌తో భేటీ నిర్వహించడంతోపాటు సీఎం చంద్రబాబుతో కూడా ప్రత్యేక భేటీ ఏర్పాటు చేశారు. దీనితో హర్షకుమార్‌ టీడీపీ తీర్థం పుచ్చుకోవడం దాదాపుగా ఖాయమైంది.
రేపే ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం సిట్టింగ్‌ ఎంపీ రవీంద్రబాబు గత నెల టీడీపీని వీడీ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. దీంతో ఖాళీ ఏర్పడిన ఆ స్థానానికి మరింత బలమైన అభ్యర్థిని బరిలోకి దించి అత్యధిక మెజారిటీతో గెలవడం ద్వారా సత్తాచాటాలని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమలాపురం లోక్‌సభ సభ్యుడిగా అఖండ మెజారిటీతో గెలిచిన జి.వి.హర్షకుమార్‌పై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. దాంతో తమ పార్టీ నుంచి దీటైన అభ్యర్థి కోసం టీడీపీ చూస్తున్న తరుణంలో ఆ అవకాశం హర్షకుమార్ కు వచ్చేలా కనిపిస్తోంది.  మరో ఒకటి, రెండు రోజుల్లో ఆయన తన అనుచరులు, బంధు మిత్రులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత సీఎం చంద్రబాబు అమలాపురం ఎంపీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa